అనుచరులు

14.8.15

కర్తవ్యం

 భరతమాత పులకించగ బంగరు బాటలు వేద్దాం
కర్మ భూమి జన్మభూమి కన్న ఋణం తీరుద్దాం

కలిమి లేమి అడ్డుగోడలు చదువుతోటి కూలతోద్దాం
కులమతాల ముళ్ళకంపలు చెలిమి తోటి దాటివేద్దాం

విద్యవిత్తును నాటుదాము ఇంటింటి ముంగిటిలో
వలసపోయే విత్తమును ఇకనైనా ఆపుదాం

ధనము కోసము దారి మళ్ళితె దేశమునకె దారిద్ర్యం
బ్రతకనిచ్చి బ్రతుకుదాం కలిసిమెలిసి అందరం

పచ్చదనం ప్రతి చోటా పరుచుకుంటూపోదాం
వెచ్చదనం ప్రబలకుండా ఇలను ఆదుకుందాము

ఆడపిల్లలె ఆధారం మనిషి జాతి మనుగడకి
ఆదరించి సాగుదాం అంతరాలు మానుకుని

విశ్వమంతా చాటినాము వివాహపు విశిష్టతను
వీడకుండ ఒకరినొకరు తోడునీడై నడుద్దాం

తల్లివేరునె తుంచగోరితె తరువుమీదికి తెగిపడదా?
తల్లిదండ్రులె మూలాలని గురుతెరిగి మసులుదాం

స్వార్ధబుద్ధిని మానుకుందాం శాంతిమంత్రము చదువుదాం
ఉజ్జ్వల భవితను తెచ్చే ఉషోదయాన్ని కోరుదాం!!!!

15.1.15

భానుమతి గారి అత్త



నమస్కారం!సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ మధ్య చాలా కాలంగా తెలుగుతీరాలకు దూరంగా ఉన్నాను.ఎన్ని పుస్తకాలు చదివానంటే,సమీక్ష రాయాలంటే, దేని గురించి రాయాలో అర్ధం కావట్లేదు.అయినా తప్పకుండా ప్రస్తావించాల్సిన పుస్తకం, "అత్తగారి కథలు". ఇది నాకు చాలా ఇష్టమైన కధానాయిక భానుమతి రాసిన కధా సంపుటి.ఇప్పుడొక చిక్కు! భానుమతి గురించి బ్లాగాలా? అత్తగారి కధల గురించి బ్లాగాలా? భానుమతి గురించి మొదలెడితే నన్నెవరూ ఆపలేరు, కాబట్టి ఎవరూ చదవలేరు.అందుకే ఇప్పటికి "అత్తగారి కధల" గురించే బ్లాగుతా.పెద్దవారికి ఇది సుపరిచితమే అయినా, ఈతరం వారికి తెలియాల్సిన అవసరం ఉంది.ఆంగ్ల సాహిత్యం వారు చెప్పే 'సిట్ కాం' ప్రక్రియలో ఉంటుంది ఈ సంపుటి. అంటే ఒకే ప్రదేశంలో ఉండే కొన్ని పాత్రల మధ్య జరిగే సన్నివేశాల వలన పుట్టే హాస్యం అన్నమాట. అనాదిగా అత్తగారి పాత్రంటే గయ్యాళిగా, రాక్షసిగా చలామణి అవుతున్న రోజుల్లో, భానుమతి ప్రాణం పోసిన అద్భుతమైన అత్తగారు,మన ఈ బామ్మగారు. కొంచెం ఛాందసంగా,కొంచెం చిలిపిగా,కొంచెం గడుసుగా ఇలా చెప్పుకుంటూ పోతే అత్తగారి పాత్రలో లేని ఛాయ లేదు.ఈ పుస్తకం పూర్తి చేశాకా నాకెందుకో మన "అమ్రుతం" ధారావాహిక గుర్తొచ్చింది. అక్కడ అమ్రుతం, ఇక్కడ భానుమతి అని పూర్తిగా అనలేము, కాని అంజి లాగా ఈ అత్తగారు రకరకాల పనులు తెలిసీ తెలియక, ఒక విధమైన అమాయకపు పట్టుదలతో చేసేసి  ఆఖరికి తెల్లబోతూ ఉంటుంది . సర్వం లాగానే, ఇక్కడ కూడా ఒక తమిళ వంట అయ్యరు ఉంటాడు. కధాగమనం అంతా బ్రాహ్మణ గంభాస అయిన ఈ అత్తగారి ఇంట్లో రచించబడింది. ఆవకాయ తో ఆరంభించిన ఈ కధలు ఆవకాయ లాగే అద్భుతంగా ఉంటాయి కానీ అత్తగారు ఆవకాయని ఎలా  పెట్టారన్నది మాత్రం చదవాల్సినదే! కట్టుడు పళ్ళూ, కూర్మావతారం కధలైతే నవ్వలేక ఛఛ్ఛాను! నవలటానికి ఇన్ని పళ్ళే చాలంటూ, తక్కువ డబ్బులకి అన్ని పళ్ళూ కాక కొన్ని మాత్రమే కట్టించుకుని ఆవిడ పడే అవస్థ భలే ఉంటుంది.ఈ హాస్యం రాయటం అంతా ఒక ఎత్తయితే, అత్తగారి పాత్రకు గౌరవం తగ్గకుండా రాయటం ఒక ఎత్తు. అత్తగారు ఎక్కడా ఒక వెర్రి దానికి మల్లే అనిపించదు.కాబట్టే ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని సొంతం చేసుకుంది ఈ అత్తగారు!!

30.3.14

జయ నామ సంవత్సర జయగీతం

జయ నామ ఉగాది శుభాకాంక్షలు.ఉగాది పండుగ నాడు పంచాంగం చదవడం, పద్యాలు పాడడం తెలుగునాట సంప్రదాయంగా పాటిస్తాము గనుక, నేనెప్పుడో రాసిన ఈ పాట తెలుగుతీరాలకు చేరుస్తున్నాను.

పల్లవి:      నీ నామ సంకీర్తనే నా జన్మ సౌభాగ్యమే,
               నీ దివ్య సాన్నీధ్యమే, నిరతిశయానందమే..

చరణం:
           
 
1. పరబ్రహ్మ తత్త్వమ్ము పరిపరి విధాలుగ ప్రకటించు ప్రకృతివీ
      పరిపూర్ణతకై పురుషుని రూపుగ ఉదయించు శ్రీ శక్తివీ...ఉదయించు శ్రీ శక్తివీ..  
 
  2.ఏ కార్య సిద్ధతకు పరమాత్మ దేహాన జీవాత్ముడై వెలిసెనో
     ఆ జన్మ సాఫల్య పధమందు నడిపించి నను బ్రోవుమా భగవతి... నను బ్రోవుమా భగవతి
           
  3.నా హృదయ మందిరము నీ స్థిర నివాసముగ వసియించి నన్నేలుమా
    నా మనః ప్రాణములు నీ చరణ కమలాలు మన్నించి రక్షింపుమా..మన్నించి రక్షింపుమా..



20.1.14

కృష్ణాతీరాన సాహితీయాత్ర-2


చాలా కాలంగా మోపిదేవి చూడాలనుకోవడానికి దైవభక్తే కాక మరొక ప్రత్యేకమైన కారణముంది.మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో ప్రసిధ్ధి. ఆలయం కట్టించినది చల్లపల్లి జమీందారుగారు.ఇది అందరికీ తెలిసినదే.ఐతే మా విశ్వనాధ సత్యనారయణ గారి వేయిపడగలు నవలకు నేపధ్యంగా ఎంచుకున్నది  మోపిదేవి స్వామినీ, చల్లపల్లి రాజుగారినేననీ 

మువ్వగోపాలుడు

పాండురంగాలయం  


 ఆ మధ్య అమ్మమ్మగారు చెప్పారు.ఇక అప్పటి నుంచి మోపిదేవి చూడాలని!! విజయవాడ నుండి మోపిదేవి దోవలోనే శ్రీకాకుళంమంటాడ (వేంకటేశ్వరుడు),చల్లపల్లి (కోట;నేనులోపలికివెళ్ళిచూడటం వీలు అవలేదు),కూచిపూడి (తెలుగు విశ్వవిద్యాలయం,కళాపీఠం,సిద్ధేంద్రయోగి మండపం)వున్నాయి.అన్నట్టు ఏకవీర నవలలో కూచిపూడి నాట్యవిన్యాసము నాకు అలలా గుర్తుకొచ్చింది.అలాగే సుమారు 6 కి.మి.దోవ చల్లపల్లి దగ్గర మారితే మొవ్వ కూడా ఉంది.  మొవ్వ లోనే తెలుగు పదకవిత ప్రాణం పోసుకున్నది. క్షేత్రయ్య పదాలుగా సుప్రసిధ్ధమైన మువ్వగోపాల పదాలను మౌద్గళ్యుడనే పిల్లవాడు కృష్ణపరమాత్మ అనుగ్రహంతో  ఊళ్ళోనే ఆశువుగా ఆలపించాడు.తరువాతి కాలంలో భారతదేశంలోని అనేక క్షేత్రాలను సందర్శిస్తూ మువ్వగోపాలుణ్ణి కీర్తిస్తూ పద్యాలు చెప్పటం వల్ల క్షేత్రయ్యగా పేరొందాడు.ఇంకాస్త దూరం వెళ్తే చిలకలపూడిగా పిలువబడే కీరపురం వుంది.ఇక్కడ కొలువైన కీరపండరినాధుడు స్వయంభువుగా చెప్పబడ్దాడు.  పాండురంగని ఆలయం ఎంత పెద్దదో అంతకన్నా ప్రశాంతమైనది.ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన స్థలమిది.నేను  గుళ్ళో ఉన్నప్పుడు ఒక చిన్న బాబు సుమారు 12 ఏళ్ళవాడు పాండురంగ బారో అంటూ స్వామిని రమ్మంటూ పాడాడండీ, ఆహా వాడి కంఠం!  రోజుకీ తలుచుకోగానే నా చెవిలో మ్రోగుతోంది.గానామృతం!!!  మచిలీపట్నంలో సముద్రతీరం,ఆపైనే హంసలదీవి చక్కటి ప్రదేశం.కృష్ణానది సముద్రంలో కలిసేది హంసలదీవిలోనే!ఇక్కడే చక్కటి కృష్ణాలయం ఉందట.అక్కడి వరకూ వెళ్ళడం నాకు కుదరలేదు.ఇంకెప్పుడైనా వెళ్ళాలి!

కృష్ణాతీరాన సాహితీయాత్ర-1

తెలుగదేలయన్న, దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొల్వ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
అని పలికినవాడు శ్రీ కృష్ణ దేవరాయలు. పలికించినవాడు శ్రీకాకుళాంధ్రదేవుడు. మహావిష్ణువు రాయలి వారి కలలో కనిపించి పద్యము పలికి, గోదా కల్యాణము, తెలుగు భాష లో రచించమని ఆదేశించాడు.

ఆదేశము ఆయనకు కలిగినది కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో! శ్రీకృష్ణదేవరాయలు విజయవాడ ఆక్రమించడానికి 1525 సంవత్సరంలో వచ్చి అప్పటికే ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రమహావిష్ణువును కొలిచి,ఏకాదశి వ్రతమాచరించారు.ఆనాటి రాత్రి కలలోనే ఆముక్తమాల్యదకు బీజం పడినది.ఇంత చారిత్రక ప్రాసస్త్యం గల శ్రీకాకుళం విజయవాడ నుండి గంటే ప్రయాణం.మన చుట్టూ ఉన్న ఎన్నో గొప్ప ప్రదేశాలను విడిచి యాత్రలకు ఇంకెక్కడికో వెళుతున్నాం.అందుకే తెలుగు కవితా వైభవాన్ని చాటిచెప్పే శ్రీకాకుళం, మొవ్వ, మోపిదేవి మొదలైన ప్రాంతాలన్నీ చూసివచ్చాను. .విజయవాడ నుండి పగలు 5 గంటలకు బయల్దేరితే, తిరిగి సాయంత్రం 6 గంటలకు విజయవాడకు వచ్చేశాం.శ్రీకాకుళంలోని విష్ణువు, ఆంధ్రమహావిష్ణువుగా పిలవబడుతాడు.ఇక్కడి వైష్ణవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది.ఆలయంలోని కుడ్యాల అందం వర్ణనాతీతం.మూలవిరాట్టులో జీవకళ ఉట్టిపడుతోంది.స్వామివారి కళ్ళూ,చేతి వేళ్ళూ ఎంత సజీవంగా అనిపిస్తాయో. మూర్తి రాలి( కోన సీమ)లోని మొహిని అవతారాన్ని పోలి ఉంది.అక్కడి విగ్రహం చుట్టూరా దశావతారాలు చెక్కినట్టే,ఇక్కడా ఉన్నాయి.గుడి ఆవరణ కూడా చాల పెద్దది. ఒకప్పుడు ఊరు రావాలంటే పడవ ప్రయాణం తప్పనిసరి.కాని ఇప్పుడు చక్కటి రహదారులున్నాయి.గుళ్ళోని ఆముక్త మాల్యద మండపంలో రాయలవారి విగ్రహముంది. అలగే రాయలువారు చెక్కించిన శిలాశాసనాలు ఆలయం మీద చూడవఛ్చు. చాలా వరుకూ అరిగిపోయి ఉన్నాయి అక్షరాలు.
ఇంకా దురదృష్టం ఏమంటే హతవిమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ మకుటంతో ప్రసిధ్ధమైన ఆంధ్ర శతకం చెక్కబడిన శిలలు పాడుబడిన ఒక పెంకుటింట్లో గుడి వెనుకనున్నాయి.విష్ణువు కృపతో పలికిన సరస్వతి సరైన ఆవాసం లేకుండా ఉండటం బాధాకరం.ప్రభుత్వం తలుచుకుంటే అదేం అంత పెద్ద పని కాదు

15.1.14

గొబ్బిళ్ళకు ప్లాస్టిక్ గ్రహణం

  అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ ఏడు భోగి మంటలు వేయలేదు.కానీ తెలుసున్న వాళ్ళింటికి బొమ్మలకొలువు పేరంటానికి వెళ్ళొచ్చా. భోగి రోజు సాయంత్రం సందె గొబ్బెమ్మలకూ మమ్మల్ని పిలిచినా వెళ్ళడం కుదరలేదు.మర్నాడు  బొమ్మలుకు వెళ్ళాము.అమ్మమ్మగారూ వాళ్ళూ కూడా చాలా ఏళ్ళ తరువాత ఈ ఏడే గొబ్బిళ్ళు పెట్టారట.వాళ్ళింటి పక్కనే ఉన్న గుళ్ళో గోశాల ఉంటే  అక్కడినించి పేడ తెచ్చి కానించారు.ఇంతకు మునుపు ఆవు పేడ దొరికేది కాదా అని నేను అడిగితే వాళ్ళన్న మాట ఠక్కుమనిపించింది.ఈ గుళ్ళో ఆవులు బయటకి వెళ్ళవట, మేత అక్కడే తింటాయట.చాలా మటుక్కు ఆవుల్ని బయటకు వదిలేయడం వల్ల,అవి దారిలో ఉండే ప్లాస్టిక్  కాగితాలు, చెత్తా చెదారం తిని తిరుగుతాయి. ఈలాటి ఆవు పేడతో గొబ్బెమ్మలు చెయలేమట!!సరిగ్గా గుండ్రంగా అయ్యి గొబ్బెమ్మలా అందంగా ఉండవు, అందులోని ప్లాస్టిక్ అవశేషాలు వల్ల! ఇన్నాళ్ళూ పశువులు ప్లాస్టిక్ తినడం వలన మంచి పాలు దొరకవనుకున్నాను గానీ ఇలా గొబ్బెమ్మలకీ కాలం చెల్లిపోవటానికీ ప్లాస్టిక్ కారణమవుతుందనుకోలేదు!!!ముగ్గులూ,గొబ్బిళ్ళూ,బొమ్మలూ ఇవి మన సత్సాంప్రదాయాలు !! కోడి పందాలు, జంతు బలులూ అమానుషం. మనిషి ఇతర జంతువుల కన్న గొప్పవాడైనప్పుడు,బలవంతుడైనప్పుడూ వాడు తనకన్నా నిర్బలులనికాపాడాలి తప్ప హాని చేయకూడదని గాంధీ గారు చెప్పిన మాట నాకు నచ్చిన మాట. ఈ పండుగ నాడు జరిగే అమానుషత్వానికి అంతం పలికి, అందరూ సత్సాంప్రదాయాలను పాటించాలని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.    

29.8.13

అసమర్థుని జీవయాత్ర

చాలా రోజుల తరువాత తెలుగు నవల చదవాలనిపించి, పుస్తకం కోసం వెతుకుతుంటే అసమర్థుని జీవయాత్ర అనే ఈ నవల గురించి తెలిసింది.త్రిపురనేని గోపీచంద్ రాసిందీ నవల.ఈ పుస్తకం చదివాకా నాకు పుట్టుకొచ్చిన చిరాకు అంతా ఇంతా కాదు!ఈ కధాంశం నుండి పాఠకులేం తెలుసుకోవాలని రచయిత కోరుకున్నాడో నాకర్ధం కాలేదు.సీతారామారావు ఈ నవలలో కధానాయకుడు! కాదు కాదు కధానయకుడనడానికి లేదు, ముఖ్య పాత్ర!
వీడంత వెధవ ఇంకోడు ఈ భూమి మీద ఎక్కడా పుట్టి ఉండడు,పుట్టడు (కనీసం ఊహల్లో కూడా పుట్టడు!)అని మొదటి నాలుగైదు కాగితాలు తిరగేస్తేనే అర్థమైపోతుంది.వీడికి మనుషులు నచ్చరు,కుటుంబ వ్యవస్థ నచ్చదు,తల్లిదండ్రులు,అత్తమామలు,భార్యాబిడ్డలు,ఇలా ఏ మానవసంబంధాలూ ఇష్టముండవు.వీడికి పెళ్ళి వద్దట!కానీ ఇంట్లో వాళ్ళను కాదనలేక పెళ్ళాడతాడు.మరి ఇంత పెళ్ళి ఇష్టం లేని వాడూ పెళ్ళం తోనే ఉంటాడు, పిల్లల్ని కంటాడు. కానీ వీడికి ఎవరన్నా ఇష్టం లేదు!వాడి నిరాశానిస్ప్రుహల్లో వాడుంటాడు, చివరికి చాలా క్రూరంగా ఆత్మహత్య చేసుకుని చస్తాడు.అదీ స్మశానంలో ఆత్మహత్య!

అసమర్థులూ,నిరాశావాదులూ,తమ ఈ అశక్తతను అధగమించడం ఎలాగో చెప్పడం మానేసి,ఒక విషాదభరిత,విషపూరిత కధాంశాన్ని పాఠకులకు అందించడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటో??