అనుచరులు

23.9.10

కదంబం

చిన్నప్పుడు మా అమ్మ తో కలిసి, వాళ్ళ కళాశాల వార్షికోత్సవానికి ప్రతి ఏడూ వెళ్ళేదాన్ని. మా విజయవాడ లో తుమ్మలపల్లి కళాక్షేత్రమని పెద్ద హాలు ఉంది, అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరిగేవి. ఎప్పుడో సరిగ్గా గుర్తు లేదు గానీ, ఒక సారి అలా మా అమ్మ శిష్యులే ఒక న్రుత్య రూపకం ప్రదర్శించారు. అమ్మా, జానకి ఆంటీ పాడారు, వాళ్ళ ప్రధానోపాధ్యాయులు పుష్పవతి గారు రచన. అంటరానితనం ఉండకూడదని ఆ ప్రదర్శనలో ఒక్కొక్క పూవు చెపుతుంది. చాలా బాగుంటుంది. రంగు పూలన్నీ, గడ్డి పూవు ని వెలేస్తే, అది దేవుడి గుడి ముందు ఏడుస్తూ, అంటరాని దానిననీ, అంటుకో కూడదని ఆమడ దూరం తరిమి, తరిమి కొడతారు ...ఇలా సాగుతుంది. చాలా రోజులకు, పూవులు మాట్లాడుకోవడం అనే ఇతివ్రుత్తం తో, ఆ మధ్యన ఆగష్టు 15 కి, అందరూ కలిసి ఉండాలని, ఈ కదంబం కూర్చాను.

తోటన పెంచిన పూవులు అన్నీ
పై చేయికి పోటీ పడ్డవి !
గొప్పలు పల్కుతు సుమములు అన్నీ
తమ శ్రేష్టతను తెల్పుతున్నవి.

జాబిలి మరపించు జాజిని నేను
జాగు జేయక ముదితలు నను జడన ముడిచేరు
పూచినంతనే తావి విరజిమ్మెదను నేను
పూవులకు రారాణి నేను !

మనసులు మురిపించెడి మల్లెను నేను
ధవళ వర్ణమున సొగసులీనుతాను
మగువ మనసులు దోచి యేలేను నేను
పూరాణి కాక ఇంకేరు నేను !

గుండెన ప్రేమను నింపెడి గులాబి నేను
మదనుడి విరి శరమ్ము నేను
ప్రేమ సామ్రజ్యమ్ము యేలుదానను
నేనుగాక పూరాణి ఇంకెవ్వరగును !

పసుపు రంగున పూచె చామంతి నేను
వన్నె తగ్గక నేను వెలుగుతాను
పసిడి కాంతులు చిమ్ముదానను నేను
పూదోట పట్టపురాణి నేను !

ఇంతులు మెచ్చెడి బంతిని నేను
ఇంటికి స్వాగత మాలను నేను
ఇంతకు మించిన అర్హత ఏమది
పూవులనందున రాణిని నేను !

ముద్దుగుమ్మలకై పూచే ముద్దమందారాన్ను
ఎరుపుమురిపెములు పంచుతాను
ఏరికోరి నను తమదోటన పెంచేరు అందరు
నేనుండగ పూరాణి ఇంకెవ్వరగును !

ఊరిమి లేక పోరెను విరులు
ఊరట కోసం కోరెను తీర్పును
అంతట....

తరింపజేసెడి తులసిని నేను
తంపులు మాని తత్త్వం వినుడు
పూలగుమీరు మానుడి పోరు
గమనించండి మాలల తీరు.

ఏక వర్ణమున ఏదోయ్ అందం
ముచ్చట గొల్పును పూల కదంబం
కలసి ఉండుట స్రుష్టి ధర్మం
చాటుడి మీరు ఈ పరమార్ధం.

చెప్పిన మాటలు విన్నవి విరులు
చెట్టాపట్టల్వేసెను చెలులు!!!

10.9.10

వేయి పడగల విశ్వనాథుడు


గోవులు తెల్లన..గొపయ్య నల్లన..(సప్తపది) అనే పాట రచనకు వేటూరి వారికి స్పూర్తి విశ్వనాథ సత్యనారాయణ రచనే అని చాలా సార్లు చెప్పారు.వేటూరి పైన నాకున్న అభిమానం చేత విశ్వనాథ వారి రచన ఏదైనా చదవాలనుకున్నాను.అలా చదివినదే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి మరియూ ఆంధ్ర విశ్వకళా పరిషద్పురస్కారాన్నందుకున్న "వేయి పడగలు".ఈ నవల 1920 ల కాలంలో మొదలయ్యి, స్వాతంత్ర్య పోరాట కాలం వరకూ సాగుతుంది.మొత్తం గ్రాంధిక భాష లో ఉంటుంది.ఈ తరం వారికి అర్ధం అవటం కష్టం.భారత దేశపు ఆత్మ అయిన భిన్నత్వం లో ఏకత్వం,ఏకత్వం లో భిన్నత్వం అన్నది ఏదైతే ఉందో,దానికి హైందవ ధర్మ శాస్త్రాన్ని జోడించి ఈ వేయి పడగలు కి పునాది వేశారు.కథా వస్తువు ఏదైనప్పటికీ ఈ పుస్తకం చదవటం వలన భాషాభివ్రుధి ఖాయం.మానవ సంబంధాల సున్నితత్వాన్ని,గాఢతను రామేశ్వర శస్త్రి భార్యల మధ్యా,సంతానం మధ్యనా చెబితే,భార్యా భర్తల బంధాన్ని ధర్మారావు-అరుంధతి పాత్రల ద్వారా చెప్పారు.వీటన్నిటికన్నా చిన్న జమిందారు-ధర్మారావు-గిరికల బంధం చిత్రమనిపిస్తుంది.పసిరిక పాత్ర ఒక వింత.ముఖ్యంగా నేను జమిందారీ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను.అలాగే స్నేహ బంధాలు బాగా చెప్పారు. ఆనాటి దేశ కాలధర్మ పరిస్థితి ఏమిటో,స్వధర్మాన్ని పరిత్యజించి పాశ్చాత్య నాగరికతానుసరణ వల్ల వచ్చే నష్టాలేమిటో,జమిందారు పాత్ర ద్వారా చెప్పబడింది.ఆధునికత మోజులో పడి, ప్రక్రుతి అందాలను మనం ఎలా కోల్పోతున్నామో చక్కగా వివరించారు.మురుగు నీరు సమస్యలూ,కంకర వల్ల వచ్చే అధిక వేడీ,వాతావరణం లో మార్పులూ కొన్ని పాత్రల ద్వారా చెప్పించారు విశ్వనాథ వారు.ఈ సమస్యలను మనం,ఈ కాలం పూర్తి స్థాయి లో అనుభవిస్తున్నాము.అన్నింటి కన్నా ముఖ్యంగా ధర్మా రావు పాత్ర చేత విశ్వనాథ వారు అనేకానేక సాహిత్య ప్రక్రియలను,వ్యాకరణాంశాలను మనకు పరిచయం చేయటం నాకు నచ్చిన అంశం. అంతే కాక గణాచారి పాత్ర కూడ బాగుంటుంది. కధలో మలుపు రాబోతున్న విషయం పాఠకులకు ఈ పాత్ర ద్వారా సూచించడం జరుగుతుంది. మూఢ నమ్మకాలకూ, సనాతన సాంప్రదాయాలకూ, అధునికతకూ, ఇలా అన్ని అంశాలకు ఈ వేయిపడగలలో స్థానం కల్పించారు రచయిత. ఈ పుస్తకం గురించి చెప్పుకుంటూ పోతే, అదే రాసుకుంటూ పోతే పడగకో కాగితం చప్పున నేను వేయి కాగితాలు రాయాల్సొస్తుంది. అందుకే ఇక చాలు. విశ్వనాథ సత్యనారాయణ గారి "రామాయణ కల్పవ్రుక్షము" తెలుగు వారి ఇంటికి జ్ఞాన పీఠ పురస్కారాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఇప్పుడు "వేయి పడగలు" ఎందుకు తలచుకున్నానో రాయాలిగా...ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారి పుట్టిన రోజు!

1.9.10

మన తెలుగు... మన గిడుగు


తెలుగు భాషకు సేవలందించిన మహానుభావులు ఎందరో...ముందుగా వారందరికి నా వందనాలు. ఒక వారం పది రోజుల నుంచీ ఒంట్లో నలతగా ఉండటం వలన మిమ్మల్ని కలవలేక పోయాను. సరిగ్గా ఈలోపే మన మాత్రుభాషా దినోత్సవం కూడా అయిపోయింది. 29వ తేదీన వ్రాయదలచింది ఇప్పుడు రాస్తున్నాగా..
ఆది కవి నన్నయ, విశిష్ఠ శబ్ద ప్రయోగముల చేత శబ్ద శాసనుడిగా బిరుదు పొందినా, శ్రీనాథుడు ప్రబంధ కవితలతో కవి సార్వభౌముడైనా, కాలాంతరంలో వీరి రచనలు పామర రంజకాలు కాలేక పోయాయి. పర దేశీయుల పాలనలో మనం ఉన్నప్పటికీ, కొందరు ఆంగ్లేయులు తెలుగు భాష మీద మక్కువ పెంచుకున్నవారు లేకపోలేరు. వ్యవహార భాషకూ, గ్రాంధికానికి ఉన్న తేడాను సామాన్య ప్రజలు పెద్దగా ఎత్తి చూపకపోయినా, ఈ దొరలు మాత్రం భాషాంతరాన్ని ప్రశ్నించారు. ఈ వరుసలో వ్యవహార భాషొద్యమానికి బీజం వేసిన వానిగా జె. ఎ. ఏట్స్ దొరని చెప్పుకోవాలి. దొర గారి ప్రశ్నకు సమాధానంగా గురజాడ, గిడుగు, పి.టి. శ్రీనివాస అయ్యంగార్ల త్రయం శిష్ట వ్యవహారిక భాషను బోధనాంశాలకు మాధ్యమంగా వాడాలని వ్యవహార భాషొద్యమానికి తెర తీశారు. అయితే గిడుగు రామమూర్తి పంతులు ఉద్యమాన్ని ప్రజలకూ, ప్రభుత్వానికి దగ్గరగా తీసుకెళ్ళారు. ఈ క్రమంలో తెలుగు అనే మాస పత్రికను కూడా నడిపారు. కేవలం తెలుగుకే కాక సవర అనే కొండ తెగ భాషకు విశిష్ఠ సేవలందించి, రావు బహదూర్ బిరుదు పొందారు గిడుగు వారు. వ్యవహార భాష కు ఇంతగా క్రుషి చేసిన గిడుగు వారి జన్మదినమైన 29.ఆగష్టున తెలుగు మాత్రుభాషా దినోత్సవం గా జరపుకోవడం నాకు చాలా ఆనందకరం. మీ అందరికీ మాత్రుభాషా దినోత్సవ శుభాకాంక్షలు. అన్నట్టు చివరిగా...గిడుగు వారు తూర్పు గోదావరి జిల్లా లోని తెలుగు భాషే ప్రామాణికముగా తెలిపారు. అంటే మాది రాజమండ్రి లెండి. కొంచెం స్వార్ధం.ఆయ్...మరి ఇంక ఉంటానండి.

20.8.10

వేగిరముగనేతెంచెను బేగం!!

ఇటు శ్రావణ మాసం పూజల హడావిడి ఇంట్లో, మరి రజియాకేమో రంజాన్ హడావిడి. రజియ లేనిదే ఆమ్మవాళ్ళింట్లో ఒక్క పనీ తెవలదు. లేచిన దగ్గర నుంచీ రజియ బేగం ఎప్పుడొస్తుందని గుమ్మంలో కూర్చోవడం అలవాటాయె! పెదనాన్న వాకిట్లో నిలబడి వేగిరముగనేతెంచెను బేగం అంటూ లోపలికి వస్తూ, దీన్నే సమస్యగా తీసుకుని పద్యం చెప్పమనగా. ఈ మూడు పద్యాలు గాట్టిగా చెప్పేశా, నా పుస్తకంలో రాశేశా, ఇప్పుడు బ్లాగేస్తున్నా. కంద పద్యానికి చాలా వరకూ దగ్గరగా ఉంటాయి ఈ ఆశువులు. చదవల్సిందే మరి...అబ్బా ! చదవండి...

హరిననుసరించ గోరుతు
భువిజేరె లచ్చి నాంచారను రూపము లో
శీఘ్రాన పతిని జేరగ
వేగిరమునతో వచ్చెను బేగమచటకున్ (తిరుమలకు)

జాబిలి జూడగ జామున
షాజహాను జేరె జమున సతిన్వీడి! పతి తా
రకను వలచునని తలపున
వేగిరమునతో వచ్చెను బేగమచటకున్

చతురోపాయము జే, రో
షనార పతి ప్రాణములు రక్షింపుటకు కట్ట
గ రక్ష అరి కరమునకున్
వేగిరమునతో వచ్చెను బేగమచటకున్

14.8.10

జండా జననం...


ఈ నేల మీద పుట్టిన మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే అది కొన్ని సంవత్సరాల పాటూ కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు, తమ స్వలాభం చూసుకోకుండా సమాజ క్షేమం కోసం చేసిన త్యాగాలే.
ఎందరి వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం
వారందరిని తలచుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు
..... అన్నట్టుగా మనం స్వాతంత్ర్య సమర వీరులందరికీ అర్పించే నివాళి, వారిని తలచుకోవటమే. ఎందరో సమిధలైన ఈ స్వేచ్ఛా యజ్ఞంలో తెలుగువారు గర్వించదగిన వీరులు ఎందరో ఉన్నారు. కత్తి పట్టిన వారు కొందరైతే , కలం పట్టిన వారు కొందరు. అహింస మార్గంలో నడచినవారు ఇంకొందరు. అయితే మన దేశం యొక్క అస్థిత్వాన్ని ప్రపంచానికి చాటే జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు తెలుగువారవడం, మనం గర్వించాల్సిన విషయం. పింగళి వారు పుట్టినది కూడా ఈ నెల 2వ తేదీనే. బందరు లో పుట్టిన పింగళి వారు, ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత పైచదువులకి కొలొంబొ వెళ్ళారు. భారత దేశం తిరిగివచ్చాకా ప్రభుత్వోద్యోగంలో చేరారు. గాంధీ గారు దక్షిణాఫ్రికా లో తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఆకర్షితులైన పింగళి వారు, తరువాతి కాలంలో కాంగ్రెస్సు పార్టీకి జెండ అవసరమని సూచించారు. అలా మొదటిసారిగా రూపొందినది మువ్వన్నెల జెండా. అయితే కాలాంతరంలో, దీంట్లోని చరకా అశోకచక్రంగా మారి భారత దేశపు జాతీయ పతాకంగా అవతరించింది. మత సామరస్యానికి, సిరిసంపదలకు, అహింసకూ మన జెండాను ఎగరవేసి అప్పుడే 63 వర్షాలు గడిచాయి., అయినా మనం సాధించవలసినది ఎంతో ఉన్నది. మహా వీరుల త్యాగాన్ని గౌరవిస్తూ మనం శాంతి సామరస్యాలతో జీవిస్తూ, బుద్ధుని పుట్టుకకు సార్ధకత చేకూర్చుదాం. భారత మాతకు జయము జయము..........

10.8.10

పుష్పవిలాపం

ఈ రోజు అరుగు దగ్గర కూర్చుని నేనూ, మా వదినా కబుర్లు చెప్పుకుంటున్నంత సేపూ, నా ద్రుష్టంతా వాకిట్లోని గులాబీ మొక్కలపైనే. మాలతి వాసనల కోసం రాత్రి మళ్ళీ ఆరు బయటే కూర్చుందామని అనుకున్నాం. తెలియకుండానే మనసు పుష్పవిలాపాన్ని గుర్తుచేసుకుంటోంది. అందుకే కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి) గారి అద్భుత రచనైన పుష్పవిలాపం మీతో పంచుకుంటున్నాను. సున్నితమైన భావజాలంతో పాటూ, కోపం, బాధ ఇందులో కనబడుతాయి. ఘంటసాల గొంతులో జీవం పోసుకున్న ఈ పుష్పవిలాపం చదవండి మరి...

నీ పూజ కోసం పూలు కోసుకు వద్దామని ప్రొద్దుననే తోటలోనికి వెళ్ళాను ప్రభూ. ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో ఉద్యానం కళకళలాడు తున్నది. పూల బాలలు తల్లి వొడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు,

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము దీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానస మందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.

ఒక సన్నజాజి కన్నియ తన సన్నని గొంతుకతో నన్ను జూచి ఇలా అన్నది ప్రభూ.
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

ఎందుకయ్యా మా స్వేచ్ఛభిమానాని కడ్డు వస్తావ్? మేం నీకేం అపకారం చేశాం?
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో,
తాళుము, త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఇంతలో ఒక గులాబి బాల కోపంతో ముఖమంతా ఎర్రజేసుకుని ఇలా అన్నది ప్రభూ.
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

పాపం, మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు గాబోలునే !
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

ఓయి మానవుడా !
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన నా హృదయకుసుమాన్ని గైకొని
నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరించుము ప్రభూ!

8.8.10

కీర్తికిరీటాలు

యద్దనపూడి సులోచనారాణి తన నవలా నాయకులను ఆరడుగుల అందగాడిలాగానూ, గిరజాల జుత్తు వాడిగానూ, రింగు రింగు పొగలూదే సోగ్గాడిలాగానూ, బాహ్య సౌందర్యాన్ని వర్ణించినా...ఆమె నాయికను మాత్రం చెక్కు చెదరని ఆత్మాభిమానానికి నిదర్శనంగా చూపుతుంది. యద్దనపూడి వర్ణనలో పాఠకులకు, నాయిక అందచందాల కన్నా కూడా, ఆమె వ్యక్తిత్వమే మనసులో నిలిచిపోతుంది. సెక్రెటరీ, హ్రుదయ గానం వంటి నవలలలో, నాయిక పాత్రలలో ఆత్మాభిమానమే కాక, స్త్రీ సహజమైన అమాయకత్వంతోబాటూ మొండితనం, మూర్ఖత్వం కనబడుతాయి. అయితే ఈ కీర్తికిరీటాలు ఇందుకు కాస్త భిన్నం అనే చెప్పుకోవాలి. కీర్తికిరీటాలు లో నాయకుడు తేజ పాత్ర, నాయిక అయిన స్వర్ణ కన్నా కూడా చాలా గాఢమైనది. తేజ చిన్నతనంలోనే తల్లిదండ్రులకి దూరమై, తాతగారింట్లోనే ఉంటూ, మేనత్త పెంపకంలో పెరుగుతాడు. తేజ పెద్దైన కొద్దీ, తనదైన ప్రపంచాన్ని నిర్మించుకుని, అందులోనే జీవిస్తూ, గిరిజనులకు సాయపడుతుంటాడు. చిననాటి జ్ఞాపకాలను మర్చిపోలేకా, స్వర్ణకు దగ్గర కాలేకా, తేజ పడే బాధే ప్రధానంగా ఉంటుంది. గొప్ప నాట్య మయూరి అయిన స్వర్ణకు జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ఎదురుకునేలా, తేజ ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఎలా కల్గించాడన్నది అసలు కధ అయినా, తేజ తల్లి రాజ్యలక్ష్మి వలనే కధకు పునాది పడుతుంది. రాజ్యలక్ష్మి జీవితాన్ని చిన్నగానే కధ మధ్యలో రచయిత్రి చెప్పినా, ఆమె పడే అంతర్మధనం, మానసిక వేదన కధలో అంతర్లీనంగా ప్రాముఖ్యతను వహిస్తాయి. జీవితం పట్ల ఆశావాహ ద్రుక్పధాన్ని, ఈ నవల చక్కగా ప్రతిబింబిస్తుంది. నేను చదివిన పుస్తకాలలో, ఈ కీర్తికిరీటాలకు ఎప్పటికీ ప్రధమ శ్రేణిలో స్థానం ఉంటుంది. వీలైనప్పుడు మీరు కూడా చదువుతారుగా....