"పురాణవైరగ్రంధ మాల" ఈ పేరు వినగానే పురాణములకు విరుద్ధమని అర్ధమవుతుంది గాని ఇందులో ఎముంటుందోనన్న ఉత్సుకత కూడా కలుగుతుంది. చదవాలని నిర్ణయించుకున్నాక, విశ్వనాధ వారి సంపూర్ణ నవలా సాహిత్యం (57 పుస్తకాలు) ఒక పెట్టి రూపం లో విడుదలైనవని తెలిసి వెంటనే తెచ్చుకున్నాము. ఈ పురాణవైరగ్రంధ మాల లో మొత్తం 12 నవలలు ఉన్నవి. వీటి పీఠిక, ఉపోద్ఘాతం చదివాకా ఈ నవలలను తప్పక చదవాలనిపించింది. ఈ పేరు అర్ధం తెలుసుకోవాలంటే తప్పక ఉపోద్ఘాతం చదవాలి.
ఉపోద్ఘాతం (కొంత భాగం మాత్రమే)
మనకు వేదశాస్త్ర పురాణేతిహాసములు కలవు. వానిలో పురాణమున్నది. పురాణమనగా నేమి? "పురాణం పంచలక్షణం " అని మనవారన్నారు. పురాణమైదు లక్షణములు కలది. సర్గము, ప్రతిసర్గము, మన్వంతరములు, రాజవంశములు, అనువంశములు- అను నీ అయిదు లక్షణములు పురాణముల యందుండును. సర్గమనగా స్రుష్టి లక్షణము. మహాప్రళయము తరువాత తొలి సారి స్రుష్టి యొక్క స్వరూపమెట్లుండునో అది సర్గము. తరువాత కొన్ని కొని ప్రళయములు జరుగును. అప్పుడు మరల స్రుష్టి జరుగును. దాని పేరు ప్రతిసర్గము. మూడవది మన్వంతరములు. క్రుత త్రేతా ద్వాపర కలి యుగములు నాల్గూ కలిపినచో ఒక మహాయుగము. ఇట్టి మహయుగములు 71 జరిగినచో , ఒక మన్వంతరము. అట్టి 14 మన్వంతరములు జరిగినచో అప్పుడు మహప్రళయము వచ్చును. ఈ లెక్క ఎక్కడ? పాశ్చాత్యులు మనకు నేర్పెడి చరిత్రలోని లెక్క ఎక్కడ? అల్పమైన ఊహ గలవారి మార్గమును మనమనుసరించుచున్నాము. నాల్గవది రాజవంశము. స్రుష్ట్యాదియందు గల సూర్య చంద్రవంశ రాజుల చరిత్రములు మన పురాణములలో నున్నవి. అనువంశములనగా వారి నుండి కలియుగములో వచ్చిన బహురాజ వంశముల చరిత్రము! అది నేడు చరిత్ర అను పేరున కళాశాలలలో, పాఠశాలలలో చదివింపబడు విషయము. దీనిని పాస్చాత్య చరిత్ర్కారులు పలువిధములుగా మార్చి పాడుచేసి వారి ఇష్టమొచ్చినవి చదివించుచున్నారు. ఇంతకు చెప్పవచ్చినదేమనగా మన పురాణములు చరిత్రయే! మన ఋషులకు చరిత్ర జ్ఞానము లేదనుట, మన పూర్వ నాగరకతను ఎంత తక్కువ పరచినచో వారి యేలుబడి అంత గొప్పగా సాగునని, పాశ్చాత్యులు పన్ని పన్నుగడ!
ఈ రచనాకాలం ఏనాటిదైనా, ఈ రోజుకి కూడా భారతీయులమందరము పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ మన మూలాలని విసర్జిస్తున్నాము. మంచి-పురోగమనదాయములు గ్రహించుట నాకు నిరభ్యంతరములు, గానీ స్వనింద-పరస్తుతి వైఖరి విపరీతముగా ప్రబలుతోంది. విశ్వనాధ వారు ఇదే విషయాన్ని చాల చక్కగా పురాణ వైర గ్రంధ మాలలో వాడుకున్నారు. పాశ్చాత్యులు మనకు చెప్పిన తప్పుడు పురాణాలకు ఇది వైరమన్న మాట! ఈ విషయాన్ని సూటి గా ప్రస్తావించక, కధ జరిగిన కాలము, ప్రదేశము వంటి విషయాల్లో చెప్పడం జరిగింది. ఉదాహరణకు జనమేజయుడు అ పక్కనే ఎక్కడో రాజ్యం చేస్తున్నడనీ, భగవద్గీత అను కొత్త గ్రంధం వెలువడిందనీ, పాత్రల చేత చెప్పిస్తూ, భారత యుద్ధం జరిగిందన్న రచయిత నమ్మకాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది. నాకీ అంశం మరి చాలా బాగా నచ్చింది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి