అనుచరులు

18.3.11

చెలియలి కట్ట సంభాషణలు

ఇంతకు ముందు వ్యాసము లో చెలియలి కట్ట కధ క్లుప్తముగా వ్రాశాను. అయితే, ఈ నవల లో గొప్పతనం అంతా కధనం, సంభాషణలదే. రంగడికీ, రత్నకీ మధ్య జరిగిన సంభాషణలన్నీ అద్భుతం. నాకు నచ్చిన ఆ తర్కాన్ని, ఈ నా తెలుగు తీరాలకు చేరుస్తున్నాను.
రంగడు కోపంతో రత్నను కొడతాడు, తరువాత తప్పైనది మన్నించమని అడిగినపుడు,
రత్న: పురుషులు స్త్రీలను కోపము వచ్చినపుడే కొట్టుదురు. శాంతించి ప్రేమించినప్పుడు లాలన చేయుదురు. స్త్రీలెదురు తిరిగినను నంతియే. కోపము వచ్చుట ప్రతి వారికిగలదు! అది కొందరిలో హద్దు మీరి పోవును. కొందరులో నియమింపబడి యుండును. వారే నాగరికులు. నియమము నాగరికత. నియమము దాటిపోవుట పశు ప్రవ్రుత్తి. ఈ నీ సంస్కార భావములన్నీ నియమ దూరములగుట చేత నొక రీతిగా పశు ప్రవ్రుత్తి. పశు ప్రవ్రుత్తికూడ కాదు. రాక్షస ప్రవ్రుత్తి. రాక్షస ప్రవ్రుత్తికిని పశు ప్రవ్రుత్తికిని భెదమేమో తెలియునా? పశు వ్రుత్తి జంతు సహజమైన వ్రుత్తి. అది ఎప్పుడునూ శరీరమునకు అపకారము చేయుట భావించుచుండును. రాక్షస వ్రుత్తి శరీరమునకు అపకారము చేయుటమాని యొకని జీవితమునకు అపకారము చేయుటకు చూచుచుండును. కోపము వచ్చి కొట్టిన చో వాడు పశువు. ఆ కోపము లోపల పెట్టుకుని, యెవని మీద కోపము వచ్చినదో వాని జీవితమునకు, వాని పురోభివ్రుధ్ధికి సర్వదా భంగము కలిగించువాడు రాక్షసుడు. భర్త భార్యను కొట్టినచో వానియందు పశుత్వము చావలేదని యర్ధము.
రంగడు తాను నమ్మిన సిధ్ధంతములే సరైనవని , ఇతరులను పశువులు గా జీవిస్తుంటే తానుధ్ధరిస్తున్నానని రత్న తో వాదిస్తున్నపుడు,

రత్న: అవతలివాడు పశు ప్రాయుడని నీవెట్లు నిర్ణయింతువు? అది నీయందున్న అహంకారము కావచ్చును.
రంగ: నేను పోల్చి చూచుచుంటిని గనుక నిర్ణయించితిని. తర్కముపయోగించితిని. ఊరికే అనుకున్నచో అహంకారము కావచ్చును. విషయమును పరామర్శించుట చేత అహంకారము కాదు.
రత్న: నీ తర్కము సంస్కారము బట్టి యుండును. నీ కది వరకే యున్న కొన్ని యూహలను బట్టి కొన్ని విశ్వాసములను బట్టి తర్కించెదవుకాని, అచ్చమయిన తర్కము నీకు తెలియదు. నీ తర్కము నీ విశ్వాస దూషితము.

రంగ: అట్లైనచో యెల్ల వారి తర్కమును దూషితమే.

రత్న:
అట్లు కాదు. తర్కము రెండు విధాలు సామాన్య మానవుని బుధ్ధిజన్య మొకటి; రెండవది శాస్త్ర విషయకము.

రంగ: ఆ శాస్త్రములు కొందరు మనుషుల చేత వ్రాతబడినది. వారి బుధ్ధికీ దోషము పట్టలేదని యెట్లు నిర్ణయించగలవు?
రత్న: మంచి ప్రశ్న. నేను నీప్రెశ్నయే ముకుందరావుగారినడిగాను. ఆయన చెప్పినది చెబుతాను. శాస్త్రము , ప్రయోగము ఇవి రెండు, ప్రయోగ విషయమున వస్తు సంపర్కము కలిగి తర్కము దూషితము కావచ్చును. శాస్త్రము వట్టి మనో వ్యాపారము. పదార్ధ స్వరూపములను బోధించు సూత్రజాలము. లోకములో మనసీ రీతి, ఈ రీతి సంచరించుట కలదు. అని పదార్ధ స్వభావ నిర్ణయము చేయుటయందు దోషము రాదు. వ్యక్తిగతాభిప్రాయములు దానిని బట్టవు. అట్లు సూత్రములైన విషయములు బహుకాలగత మహాపురుషబుధ్ధినికషమును పొంది యదార్ధతను సంపాదించును. అది శాస్త్రము. దానియందు నీవు శాస్త్రీయ చర్చ తో దోషము చూపింపుము. అట్టి సూత్రము లున్నప్పుడు వాని ననుసరించి నీవు వాదించుట న్యాయము. అప్పుడు నీ వాదములో దోషము తెలియకలదు. వట్టి ముఖద్రుష్టి వాదములో నేదియూ నిర్ణయింపబడదు.

రంగ: నీ సూత్రములు లోకవ్యవహారము. సర్వ మనో వ్యాపారము వీనినుండి తీసిన సామాన్య ధర్మములే. అవి యందరకును తెలియును. అవి, శాస్త్రము నుండి నేర్వపనిలేదు.

రత్న: అయినచో శాస్త్రములెందుకున్నవి?

రంగ: అవి తోచియు తోచని వారి యభూతకల్పనలు.

రత్న: లోకములో సర్వ గ్రంధములిట్లే. నీ స్నేహితులు వ్రాసినవినట్లే. మనుష్యుడు స్వయం శక్తి. ఇక వేరే గ్రంధములెందుకు? చదువులెందుకు? నీవు చెప్పుట యెందుకు? నేను వినుట యెందుకు?

రంగ: గ్రంధములు మనము మాటాడుకొనుట వంటివే.

రత్న: శాస్త్రము మన మెట్లు మాటాడుకొనవలయునో చెప్పునటువంటివి.

రంగ: అది మనకు తెలియును. శాస్త్రము చెప్పనక్కరలేదు.

రత్న: మనము మాటాడు కొనచునేయున్నాము. గ్రంధము వ్రాయనక్కర లేదు.

రంగ: అందరకూ అన్నియూ తెలియవు. అన్నియూ మాటాడుటకు వీలు లేదు. అందరు నన్నివేళలను కలిసికొనరు.

రత్న: అందరు నన్నియూ మాటాడలేరు. అందరకు నన్నియూ తెలియవు. మాటాడగల ప్రతివానికిని మాటాడు శక్తి లేదు. అట్లు మాటాడినపుడు వచ్చు దోషములు తెలియవు. అందుచే ఆ దోషములెట్టివో , మాటాడుట యెట్లో చెప్పునది శాస్త్రము. ఊహించుట యెట్లో చెప్పునది శాస్త్రము.

కామెంట్‌లు లేవు: