అనుచరులు

29.12.11

మా గోదావరి

కోనసీమ కళ్ళారా చూసిన తరువాత గానీ తెలియలేదు అందరూ ఎందుకు అంత పొగుడుతారో. ఎటు చూసినా గోదావరి నది, రోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలూ, ఇళ్ళలోంచి బయటకు రావాలంటే కాలువ దాటి రోడ్డు మీదకి రావలి.భలే అనిపించింది! దాదాపు అన్ని ఇళ్ళ మీద నుంచీ గుమ్మడి కాయలూ, కాకరకాయలూ హలో చెబుతున్నాయి. ఇక కొబ్బరి చెట్లు, కలువ పూవులు, మెట్ట తామరల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోనసీమంటేనే కొబ్బరి కదా!ఇక గోదావరి సముద్రం లో కలిసేది కోనసీమ చివరాఖరనున్న అంతర్వేదిలో.నాకైతే అసలక్కడ నుంచి రావాలనిపించ లేదు. ఎంత బాగుందో గోదావరి సముద్రంలో కలవడం చూస్తుంటే!
విశ్వనాథ పలుకై...అది విరుల తేనె చినుకై ..కూనలమ్మ కులుకై..అది కూచిపూడి నడకై..
పచ్చని చేల పావడ గట్టీ..కొండమల్లెలే కొప్పున బెట్టీ..వచ్చే దొరసాని..మా వన్నెల కిన్నెరసాని......

వేటూరి వారు గోదావరి అందాలను ఎంతగా పొగిడినా చాలలేదనిపిస్తోంది.ఆయన వర్ణించినట్టు విశ్వనాథ వారి రచనంత గంభీరం గా, కూచిపూడి నాట్యమంత అందంగా ఉంది నదీప్రవాహం.నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది దేవులపల్లి వారు అంత చక్కటి కవితలెట్లా రాయగలిగారో! మా గోదావరి పాడి-పంటలకే కాదు,సంగీత-సాహిత్యాలకూ నెలవు.

26.10.11

జ్ఞాన జ్యోతులు వెలగాలి!!!

అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా, నా చిన్నప్పుడు మా నాన్న గారు రచించి నాకు నేర్పించి, పాడించిన ఈ పాట నా తెలుగు తీరాలకు చేరుస్తున్నాను.

జ్యోతులు వెలగాలీ, జ్ఞాన జ్యోతులు వెలగాలీ
తరతరాల అజ్ఞానం పటాపంచలైపోవాలి
అంతరాలు లేనే లేని కొత్త యుగం ప్రభవించాలి
జ్యోతులు వెలగాలీ, జ్ఞాన జ్యోతులు వెలగాలీ !!

పాత్రతనే ప్రమిదగ చేసీ,త్యాగమనే చమురును పోసీ
కర్తవ్యము వత్తిగ వేసీ,శాంతిసౌఖ్యానంద కిరణములు
భువినెల్లల తాండవించగా.....జ్యోతులు వెలగాలీ, జ్ఞాన జ్యోతులు వెలగాలీ!!

10.9.11

విశ్వనాధ వారి జన్మదినం ఈ రోజే....తెలుసా?

జయ హో విశ్వనాధ కవి సామ్రాట్టునకు! ఈ రోజు వారి జన్మదినం ఎవ్వరూ పట్టించుకోవట్లేదని నేను గత కొన్నేళ్ళగా బాధ పడి పోయేస్తున్నాను. కొంతలో కొంత నయమేమిటంటే, దూరదర్శన్ సప్తగిరి లో విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు ధారావాహిక మొదలెట్టారు. ఇది వారి పుట్టిన రోజును పురస్కరించుకొని అవునో కాదో నాకు తెలియదు కానీ, ఆ ధారావాహిక చూడ గానే నాకు చాలా బాగా అనిపించింది.ఈ రోజు మధ్యహ్నం 3.30 నిమిషాలకు వచ్చింది. రోజూ ప్రసారమవుతుందో, మరి వారాంతాల్లో మాత్రమేనో తెలుసుకోవాలి. కొన్నాళ్ళ క్రితం ఒక సారి ప్రసారం అయిందట. ఇప్పుడు మాత్రం తప్పకుండా చూడాలి!!

29.8.11

మన భాషను బ్రతికిద్దాం!

గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినమైన ఈ రోజు , వారు తెలుగు భాష కు అందించిన సేవలను గౌరవిస్తూ మనందరం తెలుగు మాత్రు భాషా దినోత్సవం గా జరుపుకుంటూ వున్నాం. వాడుక భాషకూ, కావ్య భాష కూ ఉన్న వ్యత్యాసం చేత విద్యార్ధులు శ్రమ పడుతున్నారనే విషయం వలన మొదలైన జీవద్భాషోద్యమం క్రమం గా తెలుగు భాషోద్యమమైనది. ఈ క్రమం లో తెలుగు విద్యాభ్యాసం లో వచ్చిన ఎన్నో మార్పులు, తెలుగు చదవడం కష్టమనే ప్రధ కొంత వరకూ తొలగించినాయి. అయితే, ఈ నాడు తెలుగు భాష పరిస్థితి ఏమిటి? ఎంతమంది పిల్లలు అమ్మా....నాన్నా, అని పిలుస్తున్నారు? ఆంగ్ల భాష లో మాటాడితేనే నాగరికత అన్న ద్రుష్టి అందరిలో నాటుకు పోయినది.క,ఖ; న, ణ;అక్షరాలను సరిగ్గా ముప్పై ఏళ్ళ వాళ్ళే పలుక లేకపోతున్నారు.ఇక పిల్లలకేమి నేర్పుతారు? గణనాధుడుఅన్న మాట చిన్న పిల్లల చేత అనిపించలేక పోతున్నా...ఎన్ని సార్లు చెప్పినా గననాదుడు!! తెలుగు కు పట్టిన తెగులు ఇలా ఉంది. పెద్దపెద్ద నగరాల్లో ఇలా ఉంది, మన పల్లెల వైపుకు వెడితే ఇంకా తెలుగు బ్రతికే ఉంది అని అనుకుంటే పొరబాటే! ఆ కొద్ది పాటి ఆశా మన ఘనత వహించిన సినిమాలు చంపేస్తున్నై.ఆ మధ్యన ఏదో తెలుగు సినిమా లో కల కీ, కళ కీ తేడా లేకుండా సంభాషణలు చెప్పాడు ఒక ప్రముఖ నాయకుడు. అలాగే పెళ్ళి అనే మాటను పెల్లి అంటున్నారు! ఇలా ఉంది మన తెలుగు . అంతర్జాతీయ నివేదికలు, అంతరించి పోతున్న భాషల జాబితాలో తెలుగు ను చేర్చినా, మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఏడాదికొక సారి , ఈ రోజు తెలుగు దినోత్సవం నామ మాత్రం గా జరిపేసి చేతులు దులిపేసుకుంటోంది. భాష ను ఆధారం గా చేసుకుని ఏర్పడిన రాష్ట్రం గా మన తెలుగు వారు గుర్తింపబడినా మన భాష పరిస్థితి ఇలా ఉంది!! తెలుగు భాష ఉద్ధరింపబడాలని మనసారా కోరుకుంటూ..జై తెలుగు తల్లి..జై తెలుగు తల్లి...జై తెలుగు తల్లి!

30.4.11

రామాయణం లో ఇంగ్లీషు వేటు!



విశ్వనాథ సత్యనారాయణ గారి ఆఖరి నవల నందిగ్రామరాజ్యం. 1976 జులై నెలలో రచింపబడినది. ఆయన శైలికి ఇది పూర్తిగా భిన్నమైన ఆధునిక వాడుక భాషలో ఈ నవల ఉంటుంది. అద్భుతమైన వ్యంగ్యం ఇందులో మనం ఆస్వాదించచ్చు. కలియుగ లక్షణాలూ, ప్రభుత్వాల పనితీరూ మొదలైనవి ముఖ్యాంశాలుగా చర్చింపబడ్డాయి. కధాంశమేమో రాముడి పట్టాభిషేకం! వనవాసం తరువాత రాముడు నందిగ్రామానికి వచ్చి, అయోధ్యాపురి రాజుగా పట్టభిషిక్తుడవ్వాలి. రాముడు లేని అయోధ్య లో కలి ప్రభావం చేత ఏర్పడిన ప్రజా ప్రభుత్వ పనితీరులో లొసుగులూ, వానర సేన చేసిన సవరణలూ మూల కధ. ఆంజనేయుడి నాయకత్వంలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో చదివితే చాలా నవ్వొస్తుంది. విశ్వనాథ వారి వ్యంగ్యాస్త్రాలు ఫలించాయి ఈ నందిగ్రామ రాజ్యంలో! ఈ నవల గురించి చెప్పాలంటే ముఖ్యంగా ప్రస్తావించాల్సింది ఆంజనేయుల వారి ఇంగ్లీషు భాషా ప్రకాశము! రాముడు లేనప్పుడు అయోధ్యను పాలిస్తున్న మంత్రులలో ఒక విద్యాశాఖా మంత్రి ఉన్నాడండి. అతడితో ఒక సందర్భంలో హనుమంతులవారిలా అన్నారు:


కోసల దేశంలో వేద విద్య పాడు చేయడానికి శంబూకుడు ( విద్యా మంత్రి) ఈ కళాశాలలు పెట్టాడు. మీ విద్య పేరు క్లేశ విద్య. కోసల అన్న పదానికి విక్రుతి ఈ క్లేశ శబ్దం. కాని సంస్క్రుతంలో క్లేశం అంటే కష్టమని అర్ధం. దేశంలో అందరూ క్లేశ విద్య అనరు.ఇక్లేశ విద్య అంటారు. ఎందుచేతనంటే సమ్యుక్తంగా ఉన్న అక్షరం ఉఛ్చరించడం కష్టం గనుక సామాన్య జనం దాని వెనుక ఇ -కలుపుతారు. మధ్య ఒక సున్నా పెడితే ఉచ్చరించడం ఇంకా తేలిక. అందుచేత మీ భాషను ఇంగ్లేశ మంటారు. మీ భాషకు ముక్కూమొగం లేదు. అది భాష కాదు.


ఇంగ్లీషు భాష శబ్దావిర్భవణకు విశ్వనాథ వారి భాష్యం బాగుంది కదా!

7.4.11

నా అభిప్రాయం

నేనెన్నో విషయాల గురించి తెలుగు తీరాల్లో ప్రస్తావిస్తున్నా, చలం గురించిన స్పందనలే ఎక్కువగా వస్తాయి. అందుకే ప్రత్యేకించి మళ్ళీ ఆయన గురించే రాస్తున్నా! చలం గారు సామాజిక చైతన్యానికి క్రుషి చేస్తే, ఆయన రచనలను ఖండించడమేమిటని చాలా మంది తమ అభిప్రాయాన్ని నా ముందుంచారు. చలం సాహిత్యం చదివే వారికి, అందులోని విపరీత పోకడలూ, మానవ సంబధాలను అతిక్రమించి విచ్చలవిడిగా బతికేయడం తప్ప ఏదీ కనపడదన్నది నా అభిప్రాయం. అసలు సామజిక చైతన్యం ఏముంది ఆ రచనలో? ఒకరి ఇంట్లో ఫలానా విధంగా ఒకత్తి ఒకడితో వెళ్ళిపోయింది అని చెబితే సమాజానికి ఒరిగేదేమిటి? వ్యక్తిత్వం అన్నది లేకుండా ఆడవారు ఉన్నారనుకోవడమే తప్పు. పూర్వ కాలం లో ముసలి మొగుడినీ, అత్తగారినీ, సవతి పిల్లల్నీ, సొంత పిల్లల్నీ తీర్చిదిద్దిన వారందరూ వ్యక్తిత్వం లేనివారేనా? ఎంత ధ్రుడ సంకల్పం ఉంటే వారలా చేయగలరు? ఎవరో ఒకరు తప్పు దారిన పోతే, ఇదివరకూ అందరూ తప్పుడు వారేనా? నేను ఎప్పటికీ చలం ప్రసిధ్ధి పొందిన రచనలను ఆస్వాదించలేను. చాలా మందికి తెలియని విషయం ఏమంటే, చలం తన వైఖరి తప్పని ఒప్పుకుని రమణ మహర్షి గారి శిష్యుడై ఆఖరి రోజులు గడిపారు. అప్పుడు ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అనవసర భావజాలానికి ప్రభావితమైన వారు, అదే వ్యక్తి స్వానుభవంతో తెలుసుకున్న లోకోత్తర సత్యాలను చెబితే ఎవరు పట్టించుకున్నారు? దీన్ని బట్టే అర్ధమవుతోంది! చాలా మందికి కావాల్సినది వివాదాస్పద అంశాలు గానీ, మంచి విషయాలు కాదు. పైగా ఈ వివాదాలకు, సమాజిక చైతన్యం అన్న పేరొకటీ! హాస్యాస్పదం గా ఉంది.

4.4.11

నారద సంతానం

భూలోక భవసాగర దర్శనార్ధం విష్ణు మూర్తుల వారు, నారదుణ్ణి వరాహంగా ఇక్కడికి పంపించారట. వరాహమంటే పంది అనుకునేరు, కాదు..ఖడ్గమ్రుగం! అలా నారదుల వారు భక్తి సాగరం లో మునిగి సంసార సాగరం లో తేలారట! మళ్ళీ విష్ణు భక్తి సాగరం లో తేలాలంటే ఈ సంసార సాగరాన్ని ఈదడం రావాలని ఒప్పందమాయె! ఆ హడావుడి లో, చాలా పొదుపుగా మన నారద వరాహులం గారు ఒక్క 60 మంది పిల్లల్ని కన్నారు. వాళ్ళే మన 60 సంవత్సరాలట.
అంటే మనకు 12 నెలలు ఉన్నట్టుగా 60 సంవత్సరాలున్నాయి. మనమే సంవత్సరం లో పుట్టామో సరిగ్గా మన షష్టి పూర్తికి మళ్ళీ అదే సంవత్సరం వస్తుందన్నమాట! ఇంతకూ మన నారద సంతానం పేర్లు చూద్దామా..అదే మన 60 సంవత్సరాల పేర్లనూ...
ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాధి, విక్రమ, వ్రుష, చిత్రభాను, సుభాను, తారణ, పార్తివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, విక్రుతి, ఖర, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖ, హేమళంబ, విళంబ, వికారి, శార్వరి, ప్లవ, శుభక్రుత్, శోభక్రుత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధిక్రుత్, పరీధావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్త, సిద్ధార్ధ, రౌద్ర, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్ష, క్రోధన, క్షయ.
ఇంకా ఏం బ్లాగాలబ్బా..... ఆ! మా నాన్నా, విశ్వనాధ సత్యనారాయణ గారు, శ్రీ రమక్రిష్ణ పరమహంస గారూ మన్మధ నామ సంవత్సరంలో పుట్టారు. ఒకరి షష్టి పూర్తి ఏట ఒకరు. బాగుంది కదా..అసలు విషయం మరిచిపోయాను..అందరికీ శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను చక్కగా ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర, బొబ్బట్లూ లాగించేశాను, మరి మీరో??

18.3.11

చెలియలి కట్ట సంభాషణలు

ఇంతకు ముందు వ్యాసము లో చెలియలి కట్ట కధ క్లుప్తముగా వ్రాశాను. అయితే, ఈ నవల లో గొప్పతనం అంతా కధనం, సంభాషణలదే. రంగడికీ, రత్నకీ మధ్య జరిగిన సంభాషణలన్నీ అద్భుతం. నాకు నచ్చిన ఆ తర్కాన్ని, ఈ నా తెలుగు తీరాలకు చేరుస్తున్నాను.
రంగడు కోపంతో రత్నను కొడతాడు, తరువాత తప్పైనది మన్నించమని అడిగినపుడు,
రత్న: పురుషులు స్త్రీలను కోపము వచ్చినపుడే కొట్టుదురు. శాంతించి ప్రేమించినప్పుడు లాలన చేయుదురు. స్త్రీలెదురు తిరిగినను నంతియే. కోపము వచ్చుట ప్రతి వారికిగలదు! అది కొందరిలో హద్దు మీరి పోవును. కొందరులో నియమింపబడి యుండును. వారే నాగరికులు. నియమము నాగరికత. నియమము దాటిపోవుట పశు ప్రవ్రుత్తి. ఈ నీ సంస్కార భావములన్నీ నియమ దూరములగుట చేత నొక రీతిగా పశు ప్రవ్రుత్తి. పశు ప్రవ్రుత్తికూడ కాదు. రాక్షస ప్రవ్రుత్తి. రాక్షస ప్రవ్రుత్తికిని పశు ప్రవ్రుత్తికిని భెదమేమో తెలియునా? పశు వ్రుత్తి జంతు సహజమైన వ్రుత్తి. అది ఎప్పుడునూ శరీరమునకు అపకారము చేయుట భావించుచుండును. రాక్షస వ్రుత్తి శరీరమునకు అపకారము చేయుటమాని యొకని జీవితమునకు అపకారము చేయుటకు చూచుచుండును. కోపము వచ్చి కొట్టిన చో వాడు పశువు. ఆ కోపము లోపల పెట్టుకుని, యెవని మీద కోపము వచ్చినదో వాని జీవితమునకు, వాని పురోభివ్రుధ్ధికి సర్వదా భంగము కలిగించువాడు రాక్షసుడు. భర్త భార్యను కొట్టినచో వానియందు పశుత్వము చావలేదని యర్ధము.
రంగడు తాను నమ్మిన సిధ్ధంతములే సరైనవని , ఇతరులను పశువులు గా జీవిస్తుంటే తానుధ్ధరిస్తున్నానని రత్న తో వాదిస్తున్నపుడు,

రత్న: అవతలివాడు పశు ప్రాయుడని నీవెట్లు నిర్ణయింతువు? అది నీయందున్న అహంకారము కావచ్చును.
రంగ: నేను పోల్చి చూచుచుంటిని గనుక నిర్ణయించితిని. తర్కముపయోగించితిని. ఊరికే అనుకున్నచో అహంకారము కావచ్చును. విషయమును పరామర్శించుట చేత అహంకారము కాదు.
రత్న: నీ తర్కము సంస్కారము బట్టి యుండును. నీ కది వరకే యున్న కొన్ని యూహలను బట్టి కొన్ని విశ్వాసములను బట్టి తర్కించెదవుకాని, అచ్చమయిన తర్కము నీకు తెలియదు. నీ తర్కము నీ విశ్వాస దూషితము.

రంగ: అట్లైనచో యెల్ల వారి తర్కమును దూషితమే.

రత్న:
అట్లు కాదు. తర్కము రెండు విధాలు సామాన్య మానవుని బుధ్ధిజన్య మొకటి; రెండవది శాస్త్ర విషయకము.

రంగ: ఆ శాస్త్రములు కొందరు మనుషుల చేత వ్రాతబడినది. వారి బుధ్ధికీ దోషము పట్టలేదని యెట్లు నిర్ణయించగలవు?
రత్న: మంచి ప్రశ్న. నేను నీప్రెశ్నయే ముకుందరావుగారినడిగాను. ఆయన చెప్పినది చెబుతాను. శాస్త్రము , ప్రయోగము ఇవి రెండు, ప్రయోగ విషయమున వస్తు సంపర్కము కలిగి తర్కము దూషితము కావచ్చును. శాస్త్రము వట్టి మనో వ్యాపారము. పదార్ధ స్వరూపములను బోధించు సూత్రజాలము. లోకములో మనసీ రీతి, ఈ రీతి సంచరించుట కలదు. అని పదార్ధ స్వభావ నిర్ణయము చేయుటయందు దోషము రాదు. వ్యక్తిగతాభిప్రాయములు దానిని బట్టవు. అట్లు సూత్రములైన విషయములు బహుకాలగత మహాపురుషబుధ్ధినికషమును పొంది యదార్ధతను సంపాదించును. అది శాస్త్రము. దానియందు నీవు శాస్త్రీయ చర్చ తో దోషము చూపింపుము. అట్టి సూత్రము లున్నప్పుడు వాని ననుసరించి నీవు వాదించుట న్యాయము. అప్పుడు నీ వాదములో దోషము తెలియకలదు. వట్టి ముఖద్రుష్టి వాదములో నేదియూ నిర్ణయింపబడదు.

రంగ: నీ సూత్రములు లోకవ్యవహారము. సర్వ మనో వ్యాపారము వీనినుండి తీసిన సామాన్య ధర్మములే. అవి యందరకును తెలియును. అవి, శాస్త్రము నుండి నేర్వపనిలేదు.

రత్న: అయినచో శాస్త్రములెందుకున్నవి?

రంగ: అవి తోచియు తోచని వారి యభూతకల్పనలు.

రత్న: లోకములో సర్వ గ్రంధములిట్లే. నీ స్నేహితులు వ్రాసినవినట్లే. మనుష్యుడు స్వయం శక్తి. ఇక వేరే గ్రంధములెందుకు? చదువులెందుకు? నీవు చెప్పుట యెందుకు? నేను వినుట యెందుకు?

రంగ: గ్రంధములు మనము మాటాడుకొనుట వంటివే.

రత్న: శాస్త్రము మన మెట్లు మాటాడుకొనవలయునో చెప్పునటువంటివి.

రంగ: అది మనకు తెలియును. శాస్త్రము చెప్పనక్కరలేదు.

రత్న: మనము మాటాడు కొనచునేయున్నాము. గ్రంధము వ్రాయనక్కర లేదు.

రంగ: అందరకూ అన్నియూ తెలియవు. అన్నియూ మాటాడుటకు వీలు లేదు. అందరు నన్నివేళలను కలిసికొనరు.

రత్న: అందరు నన్నియూ మాటాడలేరు. అందరకు నన్నియూ తెలియవు. మాటాడగల ప్రతివానికిని మాటాడు శక్తి లేదు. అట్లు మాటాడినపుడు వచ్చు దోషములు తెలియవు. అందుచే ఆ దోషములెట్టివో , మాటాడుట యెట్లో చెప్పునది శాస్త్రము. ఊహించుట యెట్లో చెప్పునది శాస్త్రము.

15.3.11

చెలియలి కట్ట

చెలియలి కట్ట చదవగానే, చలం మైదానం( పరిచయమున్నవారికి) స్ఫురించడం లో ఆశ్చర్యం లేదు. మైదనం కి విశ్వనాథ వారు వేసిన అడ్డుకట్ట ఈ చెలియలి కట్ట.ఈ రెండు కథలకూ నాయిక భర్తను విడిచి పరాయి వాడితో వెళ్ళిపోవడమన్నది సారూప్యత. కానీ పాత్రల చిత్రీకరణ లో ఏ మాత్రం పోలికుండదు.
మైదానం లో రాజేశ్వరిది ప్రేమరాహిత్యాన్ని అనుభవించే పాత్ర. భర్త దగ్గర తాను పొందలేని ప్రేమను వేరొకరి దగ్గర వెతుక్కుంటూ, సమాజపు కట్టుబాట్లను ఎదిరిస్తుంది.అమీరు తో కలిసి మైదానం లో విచ్చలవిడిగా బ్రతికి నాశనమవుతుంది. తన నిర్ణయాలకు పర్యవసానం ఏదైనా సరే పశ్చాత్తాపపడదు.సమాజాన్ని మాత్రం నిందిస్తూ ఉంటుంది.
ఇహ, చెలియలి కట్ట రత్నావళి అమాయకత్వం చేత, మరిది రంగడి చెప్పుడు మాటలకు లోబడి అతనితో వెళ్ళిపోతుంది. ఇక్కడ చిత్రమేమిటంటే రంగడు కూడా కొందరి విప్లవ భావజాలానికి లోబడి ఆవేశం లోనే ఈ పని చేస్తాడు. తను వదినగారికి మేలు చేస్తున్నానన్న ఉద్దేశ్యం లో ఉంటాడు రంగడు.
కధాగమనం లో రంగడు, రత్న కోరిన విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తాడు. ఇదే గాక, రంగడి స్నేహితులతో రత్న పరిచయం , పరాభవం మొదలైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమం లో రత్న స్వాధ్యాయం చేసుకోవడం మొదలెడుతుంది. చివరిగా ముకుందరావు దగ్గర విద్యాభ్యసం ఆమెకు కొత్త ఉత్తేజాన్నీ, విచక్షణా శక్తిని ఇస్తుంది.తెలుగు విదూషిగా ఒక పాఠశాలలో సంపాదన ఆరంభిస్తుంది. అలాగే రంగడు చదువు సాగక, ఉద్యోగంలో చేరి, సంపాదిస్తుంటాడు.కొన్నాళ్ళిలా గడిచినా, వీరిద్దరికీ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయముండదని చెప్పటానికి రచయిత అద్భుత తర్కాన్ని ఆవిష్కరించారు.కధ సాగుతున్న కొలదీ, రత్నకు, దూరమైన బంధువులు ఎదురవడం, భర్తైన సీతారామయ్య మళ్ళీ పెళ్ళాడి, కొడుకును కన్నాడని తెలియడం జరుగుతుంది. రంగడు కూడా తాను చేసింది తప్పని కుంగిపోతుంటాడు. కష్టమైనా, సుఖమైనా రత్న చేయి వదలకూడదని అనుకుంటాడు. కూడబెట్టిందంతా, మేనల్లుడికి ఇచ్చేస్తాడు.
రత్న కూడా తన డబ్బును భర్త కొడుకు పేరున పెట్టి తనకు ఉత్తరక్రియలు జరిగేట్టు చూడమని భర్త దగ్గర మాట తీసుకుని, చెలియలి కట్ట తెగిపోతున్న సముద్రపు వడ్డున రంగడి తో కలిసి కూర్చుంటుంది. వారి ఆత్మహత్యతో కధ సమాప్తం.
చెలియలి కట్ట తెగితే సముద్రుడు ఎలా ముంచేస్తాడో, ధర్మం దాటితే జీవితం మునిగిపోతుందని చెబుతూ, చలం వంటి వారి భావాలనీ, ఆయన రాసిన మైదానాన్నీ మా విశ్వనాథ వారు ముంచేశారు! ఇందులో సందర్భానుసారంగా బిచ్చగాడి పదాలు చాలా బాగుంటాయి.

24.2.11

మన రమణ

తెలుగు వారికి హాస్య రసాన్ని కొత్తగా ఆయన కథల ద్వారా, సినీమాల ద్వారా, పాత్రలను తీర్చిదిద్దడమే కాక, కొత్త కొత్త పద ప్రయోగాలతో గిలిగింతలు పెడుతూ పరిచయం చేశారు రమణ గారు. అటువంటి హాస్యాన్ని ఆయన కలం తో పండిస్తూనే, వంశవ్రుక్షం వంటి గాఢమైన కధకు మాటలందించారు. వారి కలానికి రెండు వైపులా పదునే. బాపు గారితో రమణ గారి స్నేహం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు, వారి స్నేహానికి ఈ మధ్యనే షష్టిపూర్తి అయ్యింది. ఈ రోజు రమణ గారు ఇక్కడ లేకపోయినా, ఆయన ఎప్పుడూ బుడుగుగానో, గోపాళం గానో, సీగాన పెసూనాంబ గానో మనని నవ్విస్తూనే వుంటారు. రమణ అనే పదానికి అర్ధమే ఆనందం కలిగించువాడు. నిజంగా ముళ్ళపూడి వెంకట రమణ గారు సార్ధక నామధేయులు. ఈ పాటికి పైనున్న దెవుళ్ళకి కూడా చక్కిలి గిలి పెడతున్నారేమో!

22.2.11

రామాయణ విషవ్రుక్షం-ఇదే ఒక విషవ్రుక్షం!


రంగనాయకమ్మ రామాయణ విషవ్రుక్షం అని ఒక పుస్తకం వ్రాసి జనం మీదికొదిలింది. కాని ఆమె బాధేంటో నాకైతే అర్ధం అవలేదు. 3 సంపుటాలూ కలిపి ఒకే పుస్తకం లో ఆ మధ్య ఎప్పుడో మళ్ళీ అచ్చేశారెవరో. తనని తాను గొప్ప రచయిత్రి అనుకునే ఈవిడ ఒక్క 85 ఎన్నో కాగితాలు మాత్రమే కలిగిన పీఠిక వ్రాసింది!!!
ఆమె ద్రుష్టిలో రామయణం ఒక విషం, రాముడు అన్న వాడు కపటి ....ఇలా ఇంకేవో అద్భుతమైన గొప్ప ఆలోచనలు ఉన్న ఆదర్శ మూర్తి, రంగనాయకమ్మ. ఇప్పుడు జనమందరూ రాముడు దేవుడంటే ఈవిడకొచ్చిన నష్టమేమిటో??
రాముడన్న వాడు ఉన్నాడా లేడా అన్నది అనవసరం. రాముడంటే మనము కొన్ని సుగుణాలకు ప్రతీక గా భావిస్తున్నము. అంటే ఏక పత్నీవ్రతుడు, సత్యవంతుడు, వీరుడు, ఇలాగనమాట. అంతే తప్ప ఎప్పుడో రాజ్యం చేసిన రాజును ఇన్ని యుగాలైనా గుర్తుంచుకుని బానిసల్లగా, గొర్రెల మందల్లాగా, మన పెద్దలు చెప్పారని పూజించటంలేదే!
సరే, రాముడన్న వాడు వాల్మికి స్రుష్టి అనుకుందాము. అప్పుడైనా ఒక సుగుణ రాశిగా వర్ణించిన ఒక పాత్రను గుర్తుంచుకుని ఆ సుగుణాలను రాముడన్న దేవుని పేరుతో జనం ఆరాధిస్తే తప్పేమిటి? మా సంస్క్రుతం అధ్యాపకులు నాకు రమేతాం ఇతి రామాః అని చెప్పేరు. అంటే ఆనందము కలిగించు వాడు రాముడు. రాముని పాత్ర మరి సర్వ జన రంజకముగా ఉంటుంది. ఆనంద స్వరూపుడే గా భగవంతుడు! అప్పుడు అనందము కలిగించువాడు దేవుడే! అలాగని పక్క వారిని బాధపెట్టి ఆనందించేవాడు దేవుడని విపరీత బుద్ధి ప్రయోగము చేస్తే అది కేవలం పైత్యం! సర్వకాల సర్వావస్థలలో ఎల్లరుకూ మంచి చేస్తూ, సన్మార్గదర్శకముగా ఉంటూ, ఆనంద ప్రదాయికముగా ఉండే లక్షణములను దేవుడన్నారు గానీ, దేవుడంటే ఎక్కడో ఆకశం లో కుర్చుని, సినెమాల్లో చూబించినట్టుండడు! కాబట్టి ఈనాడు మనం రాముడన్న పేరుతో ఆరాధిస్తున్న సుగుణాలు ఖచ్చితం గా దైవీ లక్షణాలు! ఇందులో మరి ఈ రంగనయకమ్మకు వచ్చిన అడ్డమేమిటో. అంటే, అందరూ బహు భార్యలతో కూడీ, జూదమాడుతూ, వ్యసనపరులై, సుగుణాలను దూషిస్తూ ఉంటే సమ సమాజం, నవ సమాజం వచ్చేసినట్టా? అందరూ ఉద్ధరింపబడతారా?
పైగా ఈ పుస్తకం యువతకు ఎంతో అవసరమని ఈవిడ అభిప్రాయం. ఏ విధంగానో? స్వనింద-పరస్తుతి ఎంత హానికరమో, పరనింద-అహంకారం కూడా అంతే హానికరం. వాల్మికిని కావ్య కర్తగా హేళన చేసే ముందు, ఈమె సామర్ధ్యం ఏమిటో తెలుసుకున్నదా? కేవలం ఒక రచన మీద వ్యాఖ్యగా కాక, జనానికి సుగుణాల మీద ఉన్న నమ్మకాన్ని హత్య చేయలన్న ఉద్దేశం గల దారుణమైన రచన ఇది! రామయణాన్ని వక్రీకరించి చూపిస్తే జనంలో వచ్చే మార్పేమిటి?
రాముడే చెడ్డవాడైతే, ఇక ఆయన గుణాల మీద ప్రజలకున్న నమ్మకము పోయి అందరూ, వివేక హీనులై వ్యసనపరులవుతారు! నష్టపోయేది ఎవరు? యావద్భారత దేశము. ప్రపంచ దేశాలన్నీ గొప్పగా తలెత్తి చూసే మన కుటుంబ వ్యవస్థ సర్వ నాశనమైపోతుంది. నిజంగానే రంగనాయకమ్మ విషవ్రుక్షాన్ని నాటింది!! మనందరి నైతిక విలువలనూ చంపిపారేశే విషం కక్కే వ్రుక్షం ఆమె వ్రాసిన ఈ మహాగ్రంధము!!

4.2.11

పురాణం పంచలక్షణం ( విశ్వనాధ సత్యనారాయణ వారి పురాణవైర గ్రంధమాల యొక్క ఉపోద్ఘాతము నుండి గ్రహింపబడినది)

"పురాణవైరగ్రంధ మాల" ఈ పేరు వినగానే పురాణములకు విరుద్ధమని అర్ధమవుతుంది గాని ఇందులో ఎముంటుందోనన్న ఉత్సుకత కూడా కలుగుతుంది. చదవాలని నిర్ణయించుకున్నాక, విశ్వనాధ వారి సంపూర్ణ నవలా సాహిత్యం (57 పుస్తకాలు) ఒక పెట్టి రూపం లో విడుదలైనవని తెలిసి వెంటనే తెచ్చుకున్నాము. ఈ పురాణవైరగ్రంధ మాల లో మొత్తం 12 నవలలు ఉన్నవి. వీటి పీఠిక, ఉపోద్ఘాతం చదివాకా ఈ నవలలను తప్పక చదవాలనిపించింది. ఈ పేరు అర్ధం తెలుసుకోవాలంటే తప్పక ఉపోద్ఘాతం చదవాలి.
ఉపోద్ఘాతం (కొంత భాగం మాత్రమే)
మనకు వేదశాస్త్ర పురాణేతిహాసములు కలవు. వానిలో పురాణమున్నది. పురాణమనగా నేమి? "పురాణం పంచలక్షణం " అని మనవారన్నారు. పురాణమైదు లక్షణములు కలది. సర్గము, ప్రతిసర్గము, మన్వంతరములు, రాజవంశములు, అనువంశములు- అను నీ అయిదు లక్షణములు పురాణముల యందుండును. సర్గమనగా స్రుష్టి లక్షణము. మహాప్రళయము తరువాత తొలి సారి స్రుష్టి యొక్క స్వరూపమెట్లుండునో అది సర్గము. తరువాత కొన్ని కొని ప్రళయములు జరుగును. అప్పుడు మరల స్రుష్టి జరుగును. దాని పేరు ప్రతిసర్గము. మూడవది మన్వంతరములు. క్రుత త్రేతా ద్వాపర కలి యుగములు నాల్గూ కలిపినచో ఒక మహాయుగము. ఇట్టి మహయుగములు 71 జరిగినచో , ఒక మన్వంతరము. అట్టి 14 మన్వంతరములు జరిగినచో అప్పుడు మహప్రళయము వచ్చును. ఈ లెక్క ఎక్కడ? పాశ్చాత్యులు మనకు నేర్పెడి చరిత్రలోని లెక్క ఎక్కడ? అల్పమైన ఊహ గలవారి మార్గమును మనమనుసరించుచున్నాము. నాల్గవది రాజవంశము. స్రుష్ట్యాదియందు గల సూర్య చంద్రవంశ రాజుల చరిత్రములు మన పురాణములలో నున్నవి. అనువంశములనగా వారి నుండి కలియుగములో వచ్చిన బహురాజ వంశముల చరిత్రము! అది నేడు చరిత్ర అను పేరున కళాశాలలలో, పాఠశాలలలో చదివింపబడు విషయము. దీనిని పాస్చాత్య చరిత్ర్కారులు పలువిధములుగా మార్చి పాడుచేసి వారి ఇష్టమొచ్చినవి చదివించుచున్నారు. ఇంతకు చెప్పవచ్చినదేమనగా మన పురాణములు చరిత్రయే! మన
షులకు చరిత్ర జ్ఞానము లేదనుట, మన పూర్వ నాగరకతను ఎంత తక్కువ పరచినచో వారి యేలుబడి అంత గొప్పగా సాగునని, పాశ్చాత్యులు పన్ని పన్నుగడ!
ఈ రచనాకాలం ఏనాటిదైనా, ఈ రోజుకి కూడా భారతీయులమందరము పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ మన మూలాలని విసర్జిస్తున్నాము. మంచి-పురోగమనదాయములు గ్రహించుట నాకు నిరభ్యంతరములు, గానీ స్వనింద-పరస్తుతి వైఖరి విపరీతముగా ప్రబలుతోంది. విశ్వనాధ వారు ఇదే విషయాన్ని చాల చక్కగా పురాణ వైర గ్రంధ మాలలో వాడుకున్నారు. పాశ్చాత్యులు మనకు చెప్పిన తప్పుడు పురాణాలకు ఇది వైరమన్న మాట! ఈ విషయాన్ని సూటి గా ప్రస్తావించక, కధ జరిగిన కాలము, ప్రదేశము వంటి విషయాల్లో చెప్పడం జరిగింది. ఉదాహరణకు జనమేజయుడు అ పక్కనే ఎక్కడో రాజ్యం చేస్తున్నడనీ, భగవద్గీత అను కొత్త గ్రంధం వెలువడిందనీ, పాత్రల చేత చెప్పిస్తూ, భారత యుద్ధం జరిగిందన్న రచయిత నమ్మకాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది. నాకీ అంశం మరి చాలా బాగా నచ్చింది!

15.1.11

సంక్రాంతి కబుర్లు


శరీర నిర్మాణానికీ, పోషణ కు ఆహారం ఎంత ప్రధానమో, మన మానసిక అరోగ్యానికి కూడా అలాగే ఆహారం ఎంతో ప్రధానమైనది. తినే తిండిని బట్టి మనసు సత్త్వ-రజో-తమో గుణ స్థితులను పొందుతుంటుంది. దీనికి శాస్త్రీయ నిరూపణలు కూడా కలవు. అటువంటి ఆహారం మన చేతికి అంది వచ్చే రోజు ఈ సంక్రాంతి..నా అధ్యాత్మిక ధోరణి ఇక్కడ అప్రస్తుతం...అంటే నే అనదల్చుకున్నది..ధాన్యం వస్తుందనమాట!!! నిజంగా రైతులకు, మనందరికీ పండుగే. ఎంతో ఆనందగా చేసుకునే వేడుక! భోగి మంటలతో చలి కాచుకోవడం, చంటి పిల్లలకు భోగి పళ్ళు పోయడం, ముగ్గులు, ముఖ్యంగా మన మెలిక ముగ్గులు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు....అబ్బా..ఈ సారి ఈ హడావిడంతా హైదరాబాదు లో ఉండిపోయి తగ్గింది గాని, పరవాలేదు..నిన్న ఒక బొమ్మలకొలువు పేరంటానికి వెళ్ళాను..దానితో సరి పెట్టుకుంటాను. ఇంకా గంగిరెద్దులు-సన్నాయి మేళమైతే ఈ సారి నా చుట్టుపక్కల ఉండే మాటేలేదు. చిన్నప్పుడు ఆవు పేడ తో అలికి, ముగ్గేసి, గొబ్బిళ్ళు పెట్టి....
సుబ్బి గొబ్బెమ్మ..సుబ్బణ్ణివ్వవే...
చామంతి పూవంటీ చెల్లెల్నివ్వవే...
తామర పూవంటీ తమ్ముణ్ణివ్వవే..
మొగలీ పూవంటీ మొగుణ్ణివ్వవే...

హా..హా అంటూ పాడటం ఇంకా కళ్ళల్లోనే ఉంది.. మా దివ్య, లక్ష్మి, రాంపండు, విజ్జి, విస్సు, సుర్యావతి, శసి...వీళ్ళందరూ నా పేరంటాళ్ళు...ఇప్పుడు కొందరైతే చంటి పిల్లల తల్లులు! బహుశా..గొబ్బిళ్ళాడటం పోయి, పిల్లలికి భోగి పళ్ళు పోస్తుంటారు! అయితేనేం చిన్నప్పుడు బాగ చేసుకునే వాళ్ళం ఈ పండుగ. హైదరబాదు వచ్చేవరకూ గాలి పటాలు ఎగరేస్తారని మాత్రం తెలియదు. ఇది కూడా బాగుంది. చిన్నప్పటి బొమ్మలకొలువులు గుర్తుచేసుకుంటూ ఉన్నా....ఇక ఏం బ్లాగినా చాంతాడంతవుతుంది! మర్చిపోయాను..ఈ రోజు తిథుల ప్రకారం స్వామి వివేకానంద జన్మదినం. వారికి నా జోతలు....మీ అందరికీ, మకర సంక్రాంతి శుభాకాంక్షలు!!