అనుచరులు

20.10.10

పొట్టి పిచ్చిక

పొట్టి పిచ్చిక ..ఈ కథ మా తాతయ్య, మా అమ్మకి చిన్నప్పుడు చెప్పేవాడట. అంటే.. పెద్దయ్యకా కూడా వాళ్ళ అక్కయ్య చేత చెప్పించుకునేదిలే... ఇక కథ చెపుతానే..
అనగనగా........ఒక ఊళ్ళో ఒక అబ్బి. ఆ అబ్బి కి పెద్ద ఉద్యోగం. రోజూ పొద్దున్నే మాంచిగా తయారయి ఇవతలకొస్తాడు. ఉద్యోగానికి వేళ్ళే దారిలో ఒక వెలగ చెట్టు ఉంది. అబ్బి రోజూ ఆ వెలగపళ్ళకేసి ఆశగా చూస్తూ వెళ్తూ ఉంటాడు. అదే చెట్టు మీద ఒక పిచ్చిక గూడు కట్టుకుని, ఎంచక్కా వెలగపళ్ళన్నీ గుటకాయ స్వాహా చేస్తుంటుంది. మన అబ్బి ఈ పిచ్చిక సంగతి కనిపెట్టి, " పొట్టి పిచ్చిక …. పొట్టి పిచ్చిక ..నీ పొట్ట పిసకా..నాకో పండివ్వా.." అని అడిగాడు. పిచ్చిక్కేమో అది దాని సొంత చెట్టు....పళ్ళన్నీ అదొక్కతే తినాలి. బాగా ఆలోచించి రేప్పొద్దున్నే బయటికి వెళ్ళే ముందు కనపడు, ఇస్తాను అంది. ఇంకేముంది, మన గురువుగారు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెలగపండు తిందామా అని ఎదురుచూస్తూ నిద్దరోయాడు. తెల్లారింది..మనవాడు మాంఛి ఖద్దరు లాల్చీ,పైజమా వేసుకుని, అత్తరు పులుముకుని తయారవుతున్నాడు. ఈలొగా పిచ్చిక కడుపునిండా వెలగపళ్ళు తినేసి, ఒక పెద్ద పండుని డొల్ల చేసి, అందులో బురద నింపి, అబ్బికి అనుమానం రాకుండా పైన వేరే డిప్పతో కప్పి, తన అస్త్రాన్ని సిద్ధం చేసేసుకుంది.
మన అబ్బి ఆశగా, చెట్టు కింద నించుని పిచ్చికా..నేను వచ్చాను, నాకు పండివ్వా అని దోసిలి పట్టి అడిగాడు. ముందే సిద్ధం చేసుకున్న బురద వెలగపండును పిచ్చిక పారేసింది...అబ్బి బట్టలు బురదైపొయాయి, అబ్బికి కోపం వచ్చింది. నీ పని ఇలా ఉందా చెబుతానంటూ , నెమ్మదిగా పిచ్చిక్కి తెలియకుండా చెట్టెక్కి దాన్ని పట్టేసుకుంటాడు. అబ్బి ఆ పిచ్చికని చలి కాలమని కూడా చూడకుండా గోదారిలో ముంచి లేవనేత్తి, "ఇప్పుడెలా ఉందో చెప్పవే పొట్టి పిచ్చికా?" అంటాడు.
దానికి పొట్టి పిచ్చిక "వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితినీ...హా..హా.." అంది.
నీ పని ఇలా ఉందా.. ఇప్పుడెలా ఉందే అంటూ నిప్పుల మీద అటూ ఇటూ తిప్పాడు.
దానికి పొట్టి పిచ్చిక, "వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితిని, గట్టు పై చలి కాగితిని..", అంది.
ఈ మాటు, పిచ్చికని ఇంటికి తీసుకుపోయి, పక్కనే పిండి దంచుతున్న వాళ్ళ చేత రోకలి పోట్లు వెయించి, ఇప్పుడెలా ఉందే అన్నాడు.
దానికి పొట్టి పిచ్చిక, "వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితిని, గట్టు పై చలి కాగితిని.అవ్వతో పిండి దంపితిని" అంది. అబ్బికి ఏం చేయాలో తోచక మంచాలల్లుతున్న చోటికి పోయి, పిచ్చికని మధ్యలో పెట్టి రెందల్లులు వేయించి, ఇప్పుదెలా ఉందే అన్నడు.
దానికి పొట్టి పిచ్చిక, "వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితిని, గట్టు పై చలి కాగితిని.అవ్వతో పిండి దంపితిని, తాతతో దడి అల్లితిని" అంది.
చేసేదేదీ లేక, అబ్బి, పొట్టి పిచ్చికని పెళ్ళానికిచ్చి, ఈ రోజు పిచ్చికని వండని చెప్పి బయటకి పోతాడు. పెళ్ళమేమో, పిచ్చికని బుట్ట కింద దాచి, వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఈ లోగా మన పిచ్చికగాడు బుట్టను ఎగిరేగిరి తన్ని, తప్పించుకు వెలగ చెట్టెక్కేశాడు. పెళ్ళం వచ్చేసరికి పిచ్చిక లేదు. అబ్బి తిడతాడేమోనన్న భయం వలన, చూరు పైనున్న కాకి గూట్లోని కాకి పిల్లల్ని వండేసింది. అబ్బి మహదానందంగా ఇంటికొచ్చి, కాళ్ళూ,చేతులు కడుక్కుని, బల్ల పైన వెండి కంచం పెట్టుకుని, ఒసేయ్ పెళ్ళం! నాకు పిచ్చికని వడ్డించన్నాడు. పెళ్ళం, అబ్బి ఎక్కడ కనిపెట్టస్తాడో అన్న భయంతో వణికిపోతూ వడ్డించింది. అబ్బి, ముక్కను నోట్లో పెట్టుకుని, ఇప్పుడేలా ఉందే పొట్టి పిచ్చికా అంటూ కొరికాడు.
వెంటనే చెట్టుమీద పిచ్చిక, చూరులో చేరి,"వెలగపండు తిని వచ్చితిని, చెరువులో స్నానము చేసితిని, గట్టు పై చలి కాగితిని, అవ్వతో పిండి దంపితిని, తాతతో దడి అల్లితిని, బుట్టలో దాగితిని, అబ్బితో కాకి మాంసం తినిపించితినీ...భలే..భలే..అబ్బితో కాకి మాంసం తినిపించితినీ...హహ..హహ.." అంటూ ఎగిరిపొయింది. అబ్బి చేతిలో పెళ్ళానికి మూడింది. ఆ తరువాత,పెళ్ళం చేతిలో చీపురికి పని దొరికింది!!!!
ఈ కథ చిన్నప్పుడు ఇష్టంగా వినటానికి కారణం, ఒకే పదం చాలా సార్లు మళ్ళీ, మళ్ళీ రావటం. మొత్తానికి చిననాటి కథ మీకు చెప్పేశాను.