అనుచరులు

15.1.15

భానుమతి గారి అత్త



నమస్కారం!సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ మధ్య చాలా కాలంగా తెలుగుతీరాలకు దూరంగా ఉన్నాను.ఎన్ని పుస్తకాలు చదివానంటే,సమీక్ష రాయాలంటే, దేని గురించి రాయాలో అర్ధం కావట్లేదు.అయినా తప్పకుండా ప్రస్తావించాల్సిన పుస్తకం, "అత్తగారి కథలు". ఇది నాకు చాలా ఇష్టమైన కధానాయిక భానుమతి రాసిన కధా సంపుటి.ఇప్పుడొక చిక్కు! భానుమతి గురించి బ్లాగాలా? అత్తగారి కధల గురించి బ్లాగాలా? భానుమతి గురించి మొదలెడితే నన్నెవరూ ఆపలేరు, కాబట్టి ఎవరూ చదవలేరు.అందుకే ఇప్పటికి "అత్తగారి కధల" గురించే బ్లాగుతా.పెద్దవారికి ఇది సుపరిచితమే అయినా, ఈతరం వారికి తెలియాల్సిన అవసరం ఉంది.ఆంగ్ల సాహిత్యం వారు చెప్పే 'సిట్ కాం' ప్రక్రియలో ఉంటుంది ఈ సంపుటి. అంటే ఒకే ప్రదేశంలో ఉండే కొన్ని పాత్రల మధ్య జరిగే సన్నివేశాల వలన పుట్టే హాస్యం అన్నమాట. అనాదిగా అత్తగారి పాత్రంటే గయ్యాళిగా, రాక్షసిగా చలామణి అవుతున్న రోజుల్లో, భానుమతి ప్రాణం పోసిన అద్భుతమైన అత్తగారు,మన ఈ బామ్మగారు. కొంచెం ఛాందసంగా,కొంచెం చిలిపిగా,కొంచెం గడుసుగా ఇలా చెప్పుకుంటూ పోతే అత్తగారి పాత్రలో లేని ఛాయ లేదు.ఈ పుస్తకం పూర్తి చేశాకా నాకెందుకో మన "అమ్రుతం" ధారావాహిక గుర్తొచ్చింది. అక్కడ అమ్రుతం, ఇక్కడ భానుమతి అని పూర్తిగా అనలేము, కాని అంజి లాగా ఈ అత్తగారు రకరకాల పనులు తెలిసీ తెలియక, ఒక విధమైన అమాయకపు పట్టుదలతో చేసేసి  ఆఖరికి తెల్లబోతూ ఉంటుంది . సర్వం లాగానే, ఇక్కడ కూడా ఒక తమిళ వంట అయ్యరు ఉంటాడు. కధాగమనం అంతా బ్రాహ్మణ గంభాస అయిన ఈ అత్తగారి ఇంట్లో రచించబడింది. ఆవకాయ తో ఆరంభించిన ఈ కధలు ఆవకాయ లాగే అద్భుతంగా ఉంటాయి కానీ అత్తగారు ఆవకాయని ఎలా  పెట్టారన్నది మాత్రం చదవాల్సినదే! కట్టుడు పళ్ళూ, కూర్మావతారం కధలైతే నవ్వలేక ఛఛ్ఛాను! నవలటానికి ఇన్ని పళ్ళే చాలంటూ, తక్కువ డబ్బులకి అన్ని పళ్ళూ కాక కొన్ని మాత్రమే కట్టించుకుని ఆవిడ పడే అవస్థ భలే ఉంటుంది.ఈ హాస్యం రాయటం అంతా ఒక ఎత్తయితే, అత్తగారి పాత్రకు గౌరవం తగ్గకుండా రాయటం ఒక ఎత్తు. అత్తగారు ఎక్కడా ఒక వెర్రి దానికి మల్లే అనిపించదు.కాబట్టే ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని సొంతం చేసుకుంది ఈ అత్తగారు!!

కామెంట్‌లు లేవు: