అనుచరులు

19.7.12

బావ-బావమరుదుల సరసాలు( కవుల కధలు )

మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు దాదాపు అందరికీ పోతన, శ్రీనాథ కవుల పద్యాలూ, వారి మధ్య విభేదాలు చెప్పే కధలు తెలుసు.కానీ మా తరం వారికి పెద్దగా ఇటువంటివి తెలియవు. అందుకోసమే ఈ సంఘటన బ్లాగుతున్నా. అదే కాక కవుల కధలు అని ప్రత్యేకంగా కూటమి మొదలెడుతున్నా. నాకు తెలిసిన కవుల చరిత్ర గురించి ఇందులో ప్రస్తావించాలని నా ఆరాటం. ముందుగా పోతన- శ్రీనథుల బావ-బావమరుదుల సరసాలు.....  

 శ్రీనాథ కవి పల్లకి లో వెడుతుండగా పోతనకు తన మహాత్మ్యము చూపగోరి పల్లకి బోయీలను తొలగిపొమ్మన్నారుట. బోయీలు లేకున్నా పల్లకి గాలిలో తేలుతూ వెళ్తోంది.ఆ వింత చూసి పోతన నాగలి కాడికి గట్టిన ఎద్దులను తొలగించారు.ఎద్దులు లేకుండానే నాగలి పొలమును దున్నుతోంది. ఆ ద్రుశ్యము చూసి శ్రీనాథుడు పల్లకి దిగివచ్చి పోతనతో " హాలికులకు సేమమా?" అని పరిహాసమాడారు. వెంటనే పోతన ..
" బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
  గూళలకిచ్చి యప్పడుపు(గూడు భుజించుటకంటె సత్కవుల్
  హాలికులైన నేమి? గహనాంతర సీమల( గందమూలకౌ
  ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై"
అంటూ కావ్యకన్యను అమ్ముకుని తినడం కంటే నిజమైన కవి హాలికుడైననూ తప్పులేదని శ్రీనాధునకు ఘాటుగా సమాధానమిచ్చారు.కానీ తరువాత తన బావ శ్రీనధుని పరివారానికి సరైన ఆతిధ్యము ఇవ్వలేక భాగవతమును ఏ రాజుకో అంకితమిచ్చుండవలసినదని పోతన అనుకున్నారట. వెంటనే సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యి కన్నీరు కార్చినదట! అప్పుడు పోతన...
"కాటుక కంటినీరు చనుకట్టు పయింబడనేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భు రాణి! నిను నా(కటికిం గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాట కీచకుల కమ్మ(, ద్రిశుద్ధిగ నమ్ము భారతీ!" అని పలికి దేవినోదార్చెనట.
ఆ దేవి కరుణ వలన ఆతిధ్యమునకు కావలసినవన్నీ సమకూరాయట.

భోజనానంతరం శ్రీనాథుని కోరికపై పోతన తాను వ్రాయుచున్న భాగవతమునందలి గజేంద్ర మోక్షము చదివి వినిపించెను. అందు
"సిరికిం జెప్ప(డు, శంఖచక్రయుగముం జేదోయి సంధింప(డే
పరివారంబును జీర(, డభ్రగపతిం బన్నింప(, డాకర్ణికాం
తరధమ్మిల్లము( జక్కనొత్త(డు, వివాదప్రోత్ధితశ్రీకుచో
పరిచేలాంచలమునైన వీడ(డు గజప్రాణావనోత్సాహియై"
అని చదవగానే శ్రీనాథుడు నవ్వి, "బావా! ఎవ్వరికీ చెప్పక, ఏ పరివారమును వెంట తీసుకునిపోక,ఏ సాధనములూ చేపట్టక విష్ణుమూర్తి గజేంద్రుడను ఎలా రక్షిద్దామని వె ళ్ళా డు!" అని వెక్కిరించెను. పోతన నవ్వి ఊరుకుండెను.
కొద్దిసేపటికి శ్రీనాథుని కొడుకు బావిలో పడ్డాడన్న  వార్త వచ్చింది. ఒక్క పరుగున శ్రీనాథుడు బావి దగ్గరకి వెళ్ళి అరవడం మొదలెట్టెనట! పోతన, అతని కొడుకు మల్లన అక్కడికి వచ్చి " బావా! ఎవ్వరికీ చెప్పక,ఏ సాధనములూ తీసుకునిరాక బావిలో పడిన కొడుకును ఎట్లు రక్షిద్దామనుకుంటివి?" అని ప్రశ్నించెను. అతని మాటలకు
 శ్రీనాథుడు తెల్లబోయెను. మల్లన " నీ కొడుకు క్షేమమే మామా !" అంటూ పిల్లవాడిని  చాటునుండి తీసుకొచ్చెనట! అప్పుడు పోతన " బావా! నాడు శ్రీహరి కూడా గజేంద్రుడను రక్షించుటకు ఇదే ఆరాటాన్ని పొందియుండును. తెలిసినదా?" అని అన్నారు.శ్రీనాథుడు పోతన యొక్క అలౌకిక కవితావిశేషమును తెలుసుకుని క్షమార్పణ కోరెను.
గుణపాఠాలు చెప్పుటకు హాలికులైననేమి అన్నట్టు ఉంది కదా ఈ కథ!



1 కామెంట్‌:

vsrao5- చెప్పారు...

సౌమ్యగారు నమస్తే. మీ బ్లాగు చాలా బాగుంది. ముఖ్యంగా బావమరదుల సరసం, గిడుగు మున్నగునవి. నా కైతే బాగా నచ్చింది. నేను సైటు తెలుగుభాగవతం.ఆర్గ్ (http://www.telugubhagavatam.org/) నడుపుతున్నా. మీకు వీలయితే ఫేస్ బుక్ (పోతన తెలుగు భాగవతం లేదా గణనాధ్యాయి) లో స్నేహ కలపండి.