అనుచరులు

5.12.10

మాయా బజారు నాకెంతిష్టమో, 50 సార్ల పైన చూశా!

అభిమన్యుని పెళ్ళి జరిగిందని మనకు తెలుసు గాని, ఎలా జరిగిందో తెలియదు. ఎప్పుడూ, ఎక్కడా పెద్దవాళ్ళు కూడా ప్రస్తావించటం వినలేదు. ఇతిహాస గాధ కు అద్భుత కల్పన జోడించి వెండితెర పై మాయాబజారు అనే ఇంద్రజాలాన్ని ఆవిష్కరించారు ఈ చిత్ర బ్రుందం వారు. ఈ కధ తెలుగు వారికి ఎంత చేరువైనదో నేను ప్రత్యేకించి చెప్పక్కరలేదు. కధా బలం, సంభషణా చాతుర్యం, హాస్యం, కల్పన, సంగీతం, చాయాగ్రహణం, నటీనటుల ప్రతిభ,ఇలా ప్రతీ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారే అందరు, అందువలనే ఈ రోజుకీ ఈ చిత్రానికి ఇంత ఆదరణ.
అసలు ఈ చిత్రం గురించి ప్రస్తావించాలంటే ఎక్కడనించి మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు.
కధారంభంలో ముఖ్యమైన పాత్రలను పరిచయం చేసి, శశి- అభిమన్యుల స్నేహం, శౌర్యం, వారి పెళ్ళి మాటలు చూపిస్తారు. కాలం గడిచి శశి- అభిమన్యులు ఒకరికొకరు ఎదురు పడటం చాలా బాగుంటుంది. ఈ సన్నివేశం ఊహించి, తెర పైన ఆవిష్కరించిన రీతి అద్భుతం. కంప్యూటరంటే తెలియని రోజుల్లో, ప్రియదర్శిని అన్న పేటిక లో ఇష్టమైన వారిని చూడవచ్చు అనే కల్పన ద్వారా నాగేశ్వర రావు( అభిమన్యుడు), సావిత్రి (శశీ) యుగళ గీతం పాడేస్తారు ( నీవేనా నను పిలచినది....నీవేనా నను తలచినది.. నీవేనా నా మదిలో నిలచీ హ్రుదయము కలవర పరచినది, నీవేనా,,,). దానితో పాటూ, బలరాముడు-రేవతి పాత్రల వ్యక్తిత్వం మనకు చెప్పడం జరిగింది. ఆహా పాటా పాడేసుకున్నాం కదా పెళ్ళాడేద్దమనుకోగానే, పాండవులు రాజ్యం పోయి, సుభద్ర కొడుకుతో సహా పుట్టిల్లు, ద్వారక చేరుకుంటారు. ఈంకేముంది రాజ్యహీనులకి కూతుర్నివ్వడం ఇష్టం లేక రేవతి, సుభద్రతో సరిగ్గా ఉండదు. ఇంతలో, బలరాముడు, సుయోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుని తో శశి పెళ్ళి కుదుర్చుకొస్తాడు. ఈ సంఘటనలతో శశి మనస్తాపం చెంది, క్రుష్ణుడి సాయమైనా అందుతుందేమోని అనుకుంటుంది. పెద్దవారు శశిని తన బావను కలవద్దొని ఆంక్షలు పెడతారు. వారి మాటలు గాలికొదిలేసి, లాహిరి లాహిరి..లాహిరిలో.. అంటూ ఒక మాంచి పాట కూడా పాడేసుకుంటారు. ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది, ప్రధాన జంటలైన శశి- అభి; రుక్మిణి- క్రుష్ణుడు; రేవతి-బలరాములూ అందరూ ఒకరి తర్వాత ఒకరు, నౌకా యానం చేస్తూ ఈ పాట పాడేసుకుంటారు. సుభద్రాభిమన్యులకీ, బలరామరేవతులకీ వాగ్వివాదం జరగి, క్రుష్ణుడు సుభద్రాభిమన్యులను అడవికి పంపేయటం తో అసలు కధ కు తెరలేస్తుంది. మన అసలు నాయకుడు కాదు..కాదు, మన అసలు నాయకుడి పాత్ర ప్రవేశిస్తుంది. అదే ఘటోత్కచుడి పాత్ర. మన యస్వీ. రంగారావు!! ఇక్కడ నాయకుడి పాత్ర అని నేను అనడానికి కారణం ఈ కధలో నాయకుడి పాత్ర ఘటోత్కచుడైనా, నాయకుడు మాత్రం సావిత్రి!!
ఘటోత్కచుడి రాజ్యం, అతని మంత్రులు, మంత్రిగారి శిష్యులైన లంబూ-జంబూ పాత్రలు మనని కడుపుబ్బ నవ్విస్తాయి. అసమదీయులు, తసమదీయులు, దుషట చతుషటయం, అనే లంబూ-జంబూల పలుకులు భలే ఉంటాయి. ఇంత కధలో మంచి పాట కూడా వస్తుంది ( భళి భళి భళి భళి దేవా...బాగున్నదయా నీ మాయా...) పరులెవరో తన రాజ్యం లోకి ప్రవేశిస్తున్నరని, ఘటోత్కచుడు, అభిమన్యుడి మీద దండెత్తుతాడు, సోదరులని తెలిసి సంతోషిస్తారు. సుభద్ర-హిడింబి (సూర్యకాంతం) కూడా ఆనందిస్తారు. ఇహ ఇక్కడినించి అసలు మాయాబజారు స్రుష్టి కి బీజం పడుతుంది. శ్రీ క్రుష్ణుడు సూత్రధారి గా ఈ కధను నడిపిస్తాడు. అందులో భాగంగా అసలు శశి ని మాయం చేసి, ఘటోత్కచుడు మాయా శశిగా మారి ద్వారక లో ప్రవేశిస్తాడు. అంటే తెర మీద ఘటోత్కచుడుగా మనకు కనపడేది మాత్రం సావిత్రి!!!! ఈ మాయ శశి, మనది సోదర ప్రేమ అంటూ అభిమన్యుడిని ఏడిపించడం భలే బాగుంటుంది. ద్వారక చేరిన ఘటోత్కచుడి గర్వ భంగం అద్భుతమైన హాస్యంతో కూడుకున్నది, శ్రీ క్రుష్ణుడు ముసలి తాతగా మారి "చిన చేప ను పెద చేప.....చిన మాయ ను పెను మాయ..." అంటూ ముప్పు తిప్పలు పెడతాడు!
ఘటోత్కచుడి మంత్రి శిష్యులతో కలిసి మాయాబజారు స్రుష్టించేస్తాడు. పెళ్ళి వారు హస్తినాపురం నుండి తరలి వస్తారు, లక్ష్మణ కుమారుడి బ్రుందం శకుని మాట మేరకు, పెళ్ళి వారిని ప్రతిదానికీ తప్పు పట్టాలని, కంబళి కాదు, గింబళి ; తల్పం కాదు, గిల్పం తెమ్మని ఇబ్బంది పెట్టినా, ఆడ పెళ్ళి పెద్దలైన లంబు-జంబులు , అన్నీ ఇస్తారు. ఒక సారి మొత్తం పెళ్ళీ వారికి సరిపడ వంటను మన ఘటోత్కచుడు వివాహ భోజనంబు...హహహా..అంటూ పాడుతూ మరీ లాగించేస్తాడు, చూసినప్పుడల్లా, నాకు లొట్టలు వేయడమే మిగిలేది!!! ఘటోత్కచుడు అంతా తినేశాకా, అక్కడ ఖాళీ గిన్నెలు చూసి, శాస్త్రి-శర్మలు, శకునికి ఫిర్యాదు చేసి మరి పాకశాలకు తీసుకొస్తారు, కాని ఈ లోగానే, రాక్షస మాయ చేత, మళ్ళీ వంటలు స్రుష్టించేస్తారు! ఇంకేముంది శకుని వాళ్ళను చెడా మడా తిడతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే, కధను మన తెలుగు వారికి ఎంత దగ్గరగా తీసుకొచ్చారంటే, పెళ్ళి వంటకాలలో మన తెలుగు వంటలు కనపడతాయి, అంతే కాక, గోంగూర పచ్చడి లేనిదే, వంట సంపూర్ణం కాదని మగపెళ్ళి వారు అంటారు. ద్వారక ఏదో మన ఆంధ్రప్రదేష్ లోనిదే అన్నట్టూ, క్రుష్ణుడు వాళ్ళూ మన తెలుగు వాళ్ళన్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే!!!అన్నట్టు మరిచాను, లంబు- జంబులు అంతమంది జనాన్ని చూసి "నర మాంసం..." అంటూ లొట్టలేయడం, వాళ్ళ గురువు వారించడం భలే నవ్వొస్తుంది. ఇంతలో సుయోధన చక్రవర్తి పట్టపు రాణి భానుమతి దేవి, కొడలికి కానుకలు ఇస్తుంది, మాయ శశి, వాటికి ముట్టుకున్నంత మాత్రానే అవి విరిగిపోతాయి, ఇవి నాకన్నా నాజూకు గా వున్నాయి అంటూ అనేసి, లక్ష్మణ కుమారుని భరతం పట్టడానికి వెళ్తుంది మాయా శశి, లక్ష్మణ కుమారుడు కూడా మరదలి అందం చూసి, సుందరి నీ వంటి దివ్య స్వరూపము...అంటూ పాడి , ఆడగానే చేతులు అ తుక్కుపోతాయి, శశి పారిపోతుంది! శశి పెళ్ళికి తయారవుతూ, ఆహ నా పెళ్ళి అంట.... అంటూ ఒక అద్భుతమయిన పాట వస్తుంది...ఈ పాట లో సావిత్రి తన సినీ జీవితం మొత్తంలోకీ అత్యద్భుత నటన ప్రదర్శించిందనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇహ ఆఖరి ఘట్టం లో ఒకే ముహూర్తానికి, శశి-అభిమన్యు; మాయా శశి-లక్ష్మణ కుమారుడి వివాహాలు మొదలవుతాయి. ఘటోత్కచుడు తన మాయ చేత లక్ష్మణ కుమారునికి భ్రమలు కల్పించి పిచ్చి వాడిలా చిత్రీకరించి, పెళ్ళిని కాస్తా గందర గోళం చేసి, దుష్ట చతుష్టయమైన సుయోదహన-దుశ్శాసన-కర్ణ-శకునులను ద్వరక అవతల పడేస్తాడు. అసలు శశి-అభి తమ కుటుంబాన్ని కలవడం తో కధ సుఖాంతమవుతుంది. శ్రీ క్రుష్ణుడి విశ్వ రూప దర్శనానికి, ఘటోత్కచుడు పరవశించి స్తుతించడం తో శుభం!!!! అన్నింటికన్నా ముఖ్యమైనది, కధలో పాండవులను చూపించకుండా, ప్రస్తావన చేత మాత్రం వారు ఉన్నట్టే అనిపించేట్టు, కధ నడిపించడం నిజంగా దర్శకుని ప్రతిభకు నిదర్శనం!!! ఈ సినిమాలోని పాటలన్నీ బాగుంటాయి, భస్మాసుర వంటి న్రుత్య రూపకాలు కూడా అలరిస్తాయి!కధ చెప్పేశా, మరి ఈ కధ వెనుక వారి గురించి ఇప్పుడు చెపుతా....
సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, ఈ చిత్రము ఒక మహాద్భుతమని చెప్పవచ్చు. మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి.ఈ చిత్రానికి మొదటగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా నియమితులయ్యారు. 4 యుగళగీతాలకు స్వర కల్పన చేసాక, కారణాంతరాల వలన ఆయన తప్పుకోగా సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు. రాజేశ్వరరావు కట్టిన బాణీలకు వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసారు ఘంటసాల. ఘంటసాల , పి.లీల , పి.సుశీల , మాధవపెద్ది సత్యం మొదలగు వారి నేపధ్య గానంలో వచ్చిన , నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునదీ, సుందరి నీవంటి, ఆహ నా పెళ్ళీ అంటా, వివాహభోజనంబు వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులు తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకోబడ్డాయి. ఆలాగే లాహిరి లాహిరి లాహిరిలో అన్న ఒకే పాటకు ముగ్గురు నటులకు (ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ , గుమ్మడి) ఘంటసాల పాడటం ఒక ప్రత్యేక విశేషం.


ఇక స్క్రిప్టు మనల్ని తల తిప్పుకోనీయకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, హర్బన్స్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్లూ మనల్ని రెప్ప వాల్చనీయకుండా చేస్తాయి. ఈ చిత్రానిది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు. ఇక స్పెషల్ ఎఫెక్టులా లెక్కపెట్టలేనన్ని. మచ్చుకు కొన్ని:

* అభిమన్యుడి దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు ఘటోత్కచుడు కొండ మీద దూకగానే ఆ అదటుకు కొండకొమ్ము విరిగి పడడమూ,
* మాయామహల్లో కంబళి లా కనిపించే గింబళి తనంతట తనే లోపలికి చుట్టుకోవడం,
* తల్పం లాంటి గిల్పం గిరగిరా తిరిగి క్రిందపడదోయడం లాంటి విడ్డూరాలు,
* ఘటోత్కచుడి "వివాహభోజనం"బు షాట్లు

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ షాట్లు ఎలా తీయగలిగారనేది తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ సినిమాలో నటించిన కొందరు కళాకారులు

కృష్ణుడు : ఎన్.టి.ఆర్ :అంతకు ముందు ఒక సినిమాలో వేసిన కృష్ణుని పాత్రకు మంచి స్పందన రాలేదు. కనుక ఈ సినిమాలో చాలా జాగ్రత్త తీసుకొని ఎన్.టి.ఆర్.కు ఈ పాత్ర, మేకప్ రూప కల్పన చేశారు. తరువాత కధ ఎవరికి తెలియదు?
అభిమన్యుడు :ఏ.ఎన్.ఆర్
శశిరేఖ:సావిత్రి
ఘటోత్కచుడు:ఎస్.వి.రంగారావు:ఈ సినిమాలో పాత్ర చిత్రీకరణ వల్ల తెలుగువారికి ఘటోత్కచుడు చాలా ప్రియమైన వ్యక్తి ఐపోయాడు.
లక్ష్మణ కుమారుడు:రేలంగి:లక్ష్మణ కుమారుని హాస్యగానిగా చూపడం మహాభారత కధలో అతని పాత్రకు అనుగుణంగా లేదు. కాని ఇది "మాయ" బజార్ కదా?
చిన్నమయ:రమణా రెడ్డి
బలరాముడు:గుమ్మడి వెంకటేశ్వరరావు
శకుని:సి.ఎస్.ఆర్
రేవతీ దేవి: ఛాయా దేవి
సుభద్ర:ఋష్యేంద్రమణి
రుక్మిణి:సంధ్య
సాత్యకి:నాగభూషణం
కర్ణుడు:మిక్కిలినేని
దుశ్శాసనుడు:ఆర్.నాగేశ్వరరావు
లంబు:చదలవాడ కుటుంబరావు
జంబు:నాల్ల రామ్మూర్తి
కృష్ణుడు మాయా రూపంలో ఉండి అటు నేనే ఇటు నేనే పాట పాడే పాత్రధారి: కంచి నరసింహారావు
శర్మ:అల్లు రామలింగయ్య
దారుకుడు: మాధవపెద్ది సత్యం
శాస్త్రి: వంగర వెంకటసుబ్బయ్య
హిడింబి : సూర్యకాంతం


మాయలు

* అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే. కానీ ఒక్క చోట ద్రౌపది లీలగా కనిపిస్తుంది (విన్నావటమ్మా, ఓ యశోదా పాట చివరిలో)
* "అహ నా పెళ్ళంట.." పాటలో తధోంధోంధోం తధీంధీంధీం అనే బిట్ ని పాడింది మాధవపెద్ది సత్యం కాదు. ఘంటసాల.
* "దురహంకార మదాంధులై.." అనే పద్యానికి ముందు వచ్చే "విన్నాను మాతా విన్నాను.." అనే సుదీర్ఘమైన డైలాగ్ ను పలికింది రంగారావు, మాధవపెద్ది సత్యం కాదు.
* ఆశ్చర్యం: ఈ సినిమాలో కర్ణుడికి అసలు కవచ కుండలాలే లేవు.
* ఈ చిత్రంలో ప్రముఖ నేపథ్య గాయకులు మాధవపెద్ది సత్యం , భళి భళి భళి భళి దేవా గీతంలో రథసారథి పాత్రలో కనిపించి మనల్ని అలరిస్తారు.

ఈ సినిమాలో హిట్టయిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు అసలు సంగీత దర్శకుడు. (చూపులు కలసిన శుభవేళా, నీవేనా నను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునది) కానీ చక్రపాణితో వచ్చిన విభేదాలవలన సాలూరు తప్పుకొనగా మిగిలిన సంగీతాన్ని ఘంటసాల అందించాడు. అయితే సినిమా టైటిల్స్‌లో సాలూరు రాజేశ్వరరావు పేరు చూపలేదు.
పాట / పద్యం: గీతరచన : నేపథ్యగానము
నీవేనా నను తలచినది: పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల
లాహిరి లాహిరి లాహిరిలో: పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.లీల
వివాహ భోజనంబు : పింగళి : మాధవపెద్ది సత్యం
అహ నా పెళ్ళియంట : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, సుశీల
భళి భళి భళి దేవా : పింగళి : మాధవపెద్ది సత్యం
చూపులు కలసిన : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.లీల

నీకోసమె నే జీవించునది : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల
సుందరి నీవంటి దివ్య : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, సావిత్రి
దయచేయండి : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల,సుశీల,మాధవపెద్ది సత్యం
విన్నావటమ్మాయశోద : పింగళి : పి.లీల,సుశీల,స్వర్ణలత
వర్ధిల్లు మా తల్లి : పింగళి : ఎమ్.ఎల్.వసంతకుమారి
అఖిల రాక్షస (పద్యం) : పింగళి : ఋష్యెంద్రమణి
అల్లి బిల్లి ఆటలె : పింగళి : సుశీల
అష్టదిక్కుంభి (పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
దురహంకార(పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
శకునియున్న(పద్యం) : పింగళి : సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
శ్రీకరులు దేవతలు : పింగళి : బృందగానం
స్వాతిశయమున(పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
జై సత్య సంకల్ప జై
శేషతల్పా(పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
ఈ సినిమాకు ఈ మధ్య కాలం లో రంగులద్దరు కూడా!!!నలుపు తెలుపులో ఉన్న ఈ చిత్రాన్ని గోల్డ్‌స్టోన్ అనే సంస్థ 2010 జనవరి 30 న రంగుల్లో విడుదల చేశారు. మాయాబజార్ పాత ఫిల్ములో సౌండ్ ట్రాక్‌లన్నీ పూర్తిగా అరిగిపోవడంతో వినసొంపుగా లేవు. అందుకని మూలం చెడకుండా నేపథ్య సంగీతం మొత్తం రీరికార్డింగ్ చేశారు. దాని తర్వాత సినిమాను 70 ఎం.ఎం కి మార్చి డీటీఎస్ కి మార్చారు. ఇందుకోసం 165 మంది నిపుణులు దాదాపు ఏడాది సమయం పాటు పనిచేశారు!!!!!!ఇహ శెలవు !!నమో క్రిష్ణ!!!నమో క్రిష్ణ!!!!!నమో...నమో!!