అనుచరులు

30.4.11

రామాయణం లో ఇంగ్లీషు వేటు!



విశ్వనాథ సత్యనారాయణ గారి ఆఖరి నవల నందిగ్రామరాజ్యం. 1976 జులై నెలలో రచింపబడినది. ఆయన శైలికి ఇది పూర్తిగా భిన్నమైన ఆధునిక వాడుక భాషలో ఈ నవల ఉంటుంది. అద్భుతమైన వ్యంగ్యం ఇందులో మనం ఆస్వాదించచ్చు. కలియుగ లక్షణాలూ, ప్రభుత్వాల పనితీరూ మొదలైనవి ముఖ్యాంశాలుగా చర్చింపబడ్డాయి. కధాంశమేమో రాముడి పట్టాభిషేకం! వనవాసం తరువాత రాముడు నందిగ్రామానికి వచ్చి, అయోధ్యాపురి రాజుగా పట్టభిషిక్తుడవ్వాలి. రాముడు లేని అయోధ్య లో కలి ప్రభావం చేత ఏర్పడిన ప్రజా ప్రభుత్వ పనితీరులో లొసుగులూ, వానర సేన చేసిన సవరణలూ మూల కధ. ఆంజనేయుడి నాయకత్వంలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో చదివితే చాలా నవ్వొస్తుంది. విశ్వనాథ వారి వ్యంగ్యాస్త్రాలు ఫలించాయి ఈ నందిగ్రామ రాజ్యంలో! ఈ నవల గురించి చెప్పాలంటే ముఖ్యంగా ప్రస్తావించాల్సింది ఆంజనేయుల వారి ఇంగ్లీషు భాషా ప్రకాశము! రాముడు లేనప్పుడు అయోధ్యను పాలిస్తున్న మంత్రులలో ఒక విద్యాశాఖా మంత్రి ఉన్నాడండి. అతడితో ఒక సందర్భంలో హనుమంతులవారిలా అన్నారు:


కోసల దేశంలో వేద విద్య పాడు చేయడానికి శంబూకుడు ( విద్యా మంత్రి) ఈ కళాశాలలు పెట్టాడు. మీ విద్య పేరు క్లేశ విద్య. కోసల అన్న పదానికి విక్రుతి ఈ క్లేశ శబ్దం. కాని సంస్క్రుతంలో క్లేశం అంటే కష్టమని అర్ధం. దేశంలో అందరూ క్లేశ విద్య అనరు.ఇక్లేశ విద్య అంటారు. ఎందుచేతనంటే సమ్యుక్తంగా ఉన్న అక్షరం ఉఛ్చరించడం కష్టం గనుక సామాన్య జనం దాని వెనుక ఇ -కలుపుతారు. మధ్య ఒక సున్నా పెడితే ఉచ్చరించడం ఇంకా తేలిక. అందుచేత మీ భాషను ఇంగ్లేశ మంటారు. మీ భాషకు ముక్కూమొగం లేదు. అది భాష కాదు.


ఇంగ్లీషు భాష శబ్దావిర్భవణకు విశ్వనాథ వారి భాష్యం బాగుంది కదా!

7.4.11

నా అభిప్రాయం

నేనెన్నో విషయాల గురించి తెలుగు తీరాల్లో ప్రస్తావిస్తున్నా, చలం గురించిన స్పందనలే ఎక్కువగా వస్తాయి. అందుకే ప్రత్యేకించి మళ్ళీ ఆయన గురించే రాస్తున్నా! చలం గారు సామాజిక చైతన్యానికి క్రుషి చేస్తే, ఆయన రచనలను ఖండించడమేమిటని చాలా మంది తమ అభిప్రాయాన్ని నా ముందుంచారు. చలం సాహిత్యం చదివే వారికి, అందులోని విపరీత పోకడలూ, మానవ సంబధాలను అతిక్రమించి విచ్చలవిడిగా బతికేయడం తప్ప ఏదీ కనపడదన్నది నా అభిప్రాయం. అసలు సామజిక చైతన్యం ఏముంది ఆ రచనలో? ఒకరి ఇంట్లో ఫలానా విధంగా ఒకత్తి ఒకడితో వెళ్ళిపోయింది అని చెబితే సమాజానికి ఒరిగేదేమిటి? వ్యక్తిత్వం అన్నది లేకుండా ఆడవారు ఉన్నారనుకోవడమే తప్పు. పూర్వ కాలం లో ముసలి మొగుడినీ, అత్తగారినీ, సవతి పిల్లల్నీ, సొంత పిల్లల్నీ తీర్చిదిద్దిన వారందరూ వ్యక్తిత్వం లేనివారేనా? ఎంత ధ్రుడ సంకల్పం ఉంటే వారలా చేయగలరు? ఎవరో ఒకరు తప్పు దారిన పోతే, ఇదివరకూ అందరూ తప్పుడు వారేనా? నేను ఎప్పటికీ చలం ప్రసిధ్ధి పొందిన రచనలను ఆస్వాదించలేను. చాలా మందికి తెలియని విషయం ఏమంటే, చలం తన వైఖరి తప్పని ఒప్పుకుని రమణ మహర్షి గారి శిష్యుడై ఆఖరి రోజులు గడిపారు. అప్పుడు ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అనవసర భావజాలానికి ప్రభావితమైన వారు, అదే వ్యక్తి స్వానుభవంతో తెలుసుకున్న లోకోత్తర సత్యాలను చెబితే ఎవరు పట్టించుకున్నారు? దీన్ని బట్టే అర్ధమవుతోంది! చాలా మందికి కావాల్సినది వివాదాస్పద అంశాలు గానీ, మంచి విషయాలు కాదు. పైగా ఈ వివాదాలకు, సమాజిక చైతన్యం అన్న పేరొకటీ! హాస్యాస్పదం గా ఉంది.

4.4.11

నారద సంతానం

భూలోక భవసాగర దర్శనార్ధం విష్ణు మూర్తుల వారు, నారదుణ్ణి వరాహంగా ఇక్కడికి పంపించారట. వరాహమంటే పంది అనుకునేరు, కాదు..ఖడ్గమ్రుగం! అలా నారదుల వారు భక్తి సాగరం లో మునిగి సంసార సాగరం లో తేలారట! మళ్ళీ విష్ణు భక్తి సాగరం లో తేలాలంటే ఈ సంసార సాగరాన్ని ఈదడం రావాలని ఒప్పందమాయె! ఆ హడావుడి లో, చాలా పొదుపుగా మన నారద వరాహులం గారు ఒక్క 60 మంది పిల్లల్ని కన్నారు. వాళ్ళే మన 60 సంవత్సరాలట.
అంటే మనకు 12 నెలలు ఉన్నట్టుగా 60 సంవత్సరాలున్నాయి. మనమే సంవత్సరం లో పుట్టామో సరిగ్గా మన షష్టి పూర్తికి మళ్ళీ అదే సంవత్సరం వస్తుందన్నమాట! ఇంతకూ మన నారద సంతానం పేర్లు చూద్దామా..అదే మన 60 సంవత్సరాల పేర్లనూ...
ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాధి, విక్రమ, వ్రుష, చిత్రభాను, సుభాను, తారణ, పార్తివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, విక్రుతి, ఖర, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖ, హేమళంబ, విళంబ, వికారి, శార్వరి, ప్లవ, శుభక్రుత్, శోభక్రుత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధిక్రుత్, పరీధావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్త, సిద్ధార్ధ, రౌద్ర, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్ష, క్రోధన, క్షయ.
ఇంకా ఏం బ్లాగాలబ్బా..... ఆ! మా నాన్నా, విశ్వనాధ సత్యనారాయణ గారు, శ్రీ రమక్రిష్ణ పరమహంస గారూ మన్మధ నామ సంవత్సరంలో పుట్టారు. ఒకరి షష్టి పూర్తి ఏట ఒకరు. బాగుంది కదా..అసలు విషయం మరిచిపోయాను..అందరికీ శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను చక్కగా ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర, బొబ్బట్లూ లాగించేశాను, మరి మీరో??