అనుచరులు

29.12.11

మా గోదావరి

కోనసీమ కళ్ళారా చూసిన తరువాత గానీ తెలియలేదు అందరూ ఎందుకు అంత పొగుడుతారో. ఎటు చూసినా గోదావరి నది, రోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలూ, ఇళ్ళలోంచి బయటకు రావాలంటే కాలువ దాటి రోడ్డు మీదకి రావలి.భలే అనిపించింది! దాదాపు అన్ని ఇళ్ళ మీద నుంచీ గుమ్మడి కాయలూ, కాకరకాయలూ హలో చెబుతున్నాయి. ఇక కొబ్బరి చెట్లు, కలువ పూవులు, మెట్ట తామరల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోనసీమంటేనే కొబ్బరి కదా!ఇక గోదావరి సముద్రం లో కలిసేది కోనసీమ చివరాఖరనున్న అంతర్వేదిలో.నాకైతే అసలక్కడ నుంచి రావాలనిపించ లేదు. ఎంత బాగుందో గోదావరి సముద్రంలో కలవడం చూస్తుంటే!
విశ్వనాథ పలుకై...అది విరుల తేనె చినుకై ..కూనలమ్మ కులుకై..అది కూచిపూడి నడకై..
పచ్చని చేల పావడ గట్టీ..కొండమల్లెలే కొప్పున బెట్టీ..వచ్చే దొరసాని..మా వన్నెల కిన్నెరసాని......

వేటూరి వారు గోదావరి అందాలను ఎంతగా పొగిడినా చాలలేదనిపిస్తోంది.ఆయన వర్ణించినట్టు విశ్వనాథ వారి రచనంత గంభీరం గా, కూచిపూడి నాట్యమంత అందంగా ఉంది నదీప్రవాహం.నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది దేవులపల్లి వారు అంత చక్కటి కవితలెట్లా రాయగలిగారో! మా గోదావరి పాడి-పంటలకే కాదు,సంగీత-సాహిత్యాలకూ నెలవు.