అనుచరులు

24.2.11

మన రమణ

తెలుగు వారికి హాస్య రసాన్ని కొత్తగా ఆయన కథల ద్వారా, సినీమాల ద్వారా, పాత్రలను తీర్చిదిద్దడమే కాక, కొత్త కొత్త పద ప్రయోగాలతో గిలిగింతలు పెడుతూ పరిచయం చేశారు రమణ గారు. అటువంటి హాస్యాన్ని ఆయన కలం తో పండిస్తూనే, వంశవ్రుక్షం వంటి గాఢమైన కధకు మాటలందించారు. వారి కలానికి రెండు వైపులా పదునే. బాపు గారితో రమణ గారి స్నేహం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు, వారి స్నేహానికి ఈ మధ్యనే షష్టిపూర్తి అయ్యింది. ఈ రోజు రమణ గారు ఇక్కడ లేకపోయినా, ఆయన ఎప్పుడూ బుడుగుగానో, గోపాళం గానో, సీగాన పెసూనాంబ గానో మనని నవ్విస్తూనే వుంటారు. రమణ అనే పదానికి అర్ధమే ఆనందం కలిగించువాడు. నిజంగా ముళ్ళపూడి వెంకట రమణ గారు సార్ధక నామధేయులు. ఈ పాటికి పైనున్న దెవుళ్ళకి కూడా చక్కిలి గిలి పెడతున్నారేమో!

22.2.11

రామాయణ విషవ్రుక్షం-ఇదే ఒక విషవ్రుక్షం!


రంగనాయకమ్మ రామాయణ విషవ్రుక్షం అని ఒక పుస్తకం వ్రాసి జనం మీదికొదిలింది. కాని ఆమె బాధేంటో నాకైతే అర్ధం అవలేదు. 3 సంపుటాలూ కలిపి ఒకే పుస్తకం లో ఆ మధ్య ఎప్పుడో మళ్ళీ అచ్చేశారెవరో. తనని తాను గొప్ప రచయిత్రి అనుకునే ఈవిడ ఒక్క 85 ఎన్నో కాగితాలు మాత్రమే కలిగిన పీఠిక వ్రాసింది!!!
ఆమె ద్రుష్టిలో రామయణం ఒక విషం, రాముడు అన్న వాడు కపటి ....ఇలా ఇంకేవో అద్భుతమైన గొప్ప ఆలోచనలు ఉన్న ఆదర్శ మూర్తి, రంగనాయకమ్మ. ఇప్పుడు జనమందరూ రాముడు దేవుడంటే ఈవిడకొచ్చిన నష్టమేమిటో??
రాముడన్న వాడు ఉన్నాడా లేడా అన్నది అనవసరం. రాముడంటే మనము కొన్ని సుగుణాలకు ప్రతీక గా భావిస్తున్నము. అంటే ఏక పత్నీవ్రతుడు, సత్యవంతుడు, వీరుడు, ఇలాగనమాట. అంతే తప్ప ఎప్పుడో రాజ్యం చేసిన రాజును ఇన్ని యుగాలైనా గుర్తుంచుకుని బానిసల్లగా, గొర్రెల మందల్లాగా, మన పెద్దలు చెప్పారని పూజించటంలేదే!
సరే, రాముడన్న వాడు వాల్మికి స్రుష్టి అనుకుందాము. అప్పుడైనా ఒక సుగుణ రాశిగా వర్ణించిన ఒక పాత్రను గుర్తుంచుకుని ఆ సుగుణాలను రాముడన్న దేవుని పేరుతో జనం ఆరాధిస్తే తప్పేమిటి? మా సంస్క్రుతం అధ్యాపకులు నాకు రమేతాం ఇతి రామాః అని చెప్పేరు. అంటే ఆనందము కలిగించు వాడు రాముడు. రాముని పాత్ర మరి సర్వ జన రంజకముగా ఉంటుంది. ఆనంద స్వరూపుడే గా భగవంతుడు! అప్పుడు అనందము కలిగించువాడు దేవుడే! అలాగని పక్క వారిని బాధపెట్టి ఆనందించేవాడు దేవుడని విపరీత బుద్ధి ప్రయోగము చేస్తే అది కేవలం పైత్యం! సర్వకాల సర్వావస్థలలో ఎల్లరుకూ మంచి చేస్తూ, సన్మార్గదర్శకముగా ఉంటూ, ఆనంద ప్రదాయికముగా ఉండే లక్షణములను దేవుడన్నారు గానీ, దేవుడంటే ఎక్కడో ఆకశం లో కుర్చుని, సినెమాల్లో చూబించినట్టుండడు! కాబట్టి ఈనాడు మనం రాముడన్న పేరుతో ఆరాధిస్తున్న సుగుణాలు ఖచ్చితం గా దైవీ లక్షణాలు! ఇందులో మరి ఈ రంగనయకమ్మకు వచ్చిన అడ్డమేమిటో. అంటే, అందరూ బహు భార్యలతో కూడీ, జూదమాడుతూ, వ్యసనపరులై, సుగుణాలను దూషిస్తూ ఉంటే సమ సమాజం, నవ సమాజం వచ్చేసినట్టా? అందరూ ఉద్ధరింపబడతారా?
పైగా ఈ పుస్తకం యువతకు ఎంతో అవసరమని ఈవిడ అభిప్రాయం. ఏ విధంగానో? స్వనింద-పరస్తుతి ఎంత హానికరమో, పరనింద-అహంకారం కూడా అంతే హానికరం. వాల్మికిని కావ్య కర్తగా హేళన చేసే ముందు, ఈమె సామర్ధ్యం ఏమిటో తెలుసుకున్నదా? కేవలం ఒక రచన మీద వ్యాఖ్యగా కాక, జనానికి సుగుణాల మీద ఉన్న నమ్మకాన్ని హత్య చేయలన్న ఉద్దేశం గల దారుణమైన రచన ఇది! రామయణాన్ని వక్రీకరించి చూపిస్తే జనంలో వచ్చే మార్పేమిటి?
రాముడే చెడ్డవాడైతే, ఇక ఆయన గుణాల మీద ప్రజలకున్న నమ్మకము పోయి అందరూ, వివేక హీనులై వ్యసనపరులవుతారు! నష్టపోయేది ఎవరు? యావద్భారత దేశము. ప్రపంచ దేశాలన్నీ గొప్పగా తలెత్తి చూసే మన కుటుంబ వ్యవస్థ సర్వ నాశనమైపోతుంది. నిజంగానే రంగనాయకమ్మ విషవ్రుక్షాన్ని నాటింది!! మనందరి నైతిక విలువలనూ చంపిపారేశే విషం కక్కే వ్రుక్షం ఆమె వ్రాసిన ఈ మహాగ్రంధము!!

4.2.11

పురాణం పంచలక్షణం ( విశ్వనాధ సత్యనారాయణ వారి పురాణవైర గ్రంధమాల యొక్క ఉపోద్ఘాతము నుండి గ్రహింపబడినది)

"పురాణవైరగ్రంధ మాల" ఈ పేరు వినగానే పురాణములకు విరుద్ధమని అర్ధమవుతుంది గాని ఇందులో ఎముంటుందోనన్న ఉత్సుకత కూడా కలుగుతుంది. చదవాలని నిర్ణయించుకున్నాక, విశ్వనాధ వారి సంపూర్ణ నవలా సాహిత్యం (57 పుస్తకాలు) ఒక పెట్టి రూపం లో విడుదలైనవని తెలిసి వెంటనే తెచ్చుకున్నాము. ఈ పురాణవైరగ్రంధ మాల లో మొత్తం 12 నవలలు ఉన్నవి. వీటి పీఠిక, ఉపోద్ఘాతం చదివాకా ఈ నవలలను తప్పక చదవాలనిపించింది. ఈ పేరు అర్ధం తెలుసుకోవాలంటే తప్పక ఉపోద్ఘాతం చదవాలి.
ఉపోద్ఘాతం (కొంత భాగం మాత్రమే)
మనకు వేదశాస్త్ర పురాణేతిహాసములు కలవు. వానిలో పురాణమున్నది. పురాణమనగా నేమి? "పురాణం పంచలక్షణం " అని మనవారన్నారు. పురాణమైదు లక్షణములు కలది. సర్గము, ప్రతిసర్గము, మన్వంతరములు, రాజవంశములు, అనువంశములు- అను నీ అయిదు లక్షణములు పురాణముల యందుండును. సర్గమనగా స్రుష్టి లక్షణము. మహాప్రళయము తరువాత తొలి సారి స్రుష్టి యొక్క స్వరూపమెట్లుండునో అది సర్గము. తరువాత కొన్ని కొని ప్రళయములు జరుగును. అప్పుడు మరల స్రుష్టి జరుగును. దాని పేరు ప్రతిసర్గము. మూడవది మన్వంతరములు. క్రుత త్రేతా ద్వాపర కలి యుగములు నాల్గూ కలిపినచో ఒక మహాయుగము. ఇట్టి మహయుగములు 71 జరిగినచో , ఒక మన్వంతరము. అట్టి 14 మన్వంతరములు జరిగినచో అప్పుడు మహప్రళయము వచ్చును. ఈ లెక్క ఎక్కడ? పాశ్చాత్యులు మనకు నేర్పెడి చరిత్రలోని లెక్క ఎక్కడ? అల్పమైన ఊహ గలవారి మార్గమును మనమనుసరించుచున్నాము. నాల్గవది రాజవంశము. స్రుష్ట్యాదియందు గల సూర్య చంద్రవంశ రాజుల చరిత్రములు మన పురాణములలో నున్నవి. అనువంశములనగా వారి నుండి కలియుగములో వచ్చిన బహురాజ వంశముల చరిత్రము! అది నేడు చరిత్ర అను పేరున కళాశాలలలో, పాఠశాలలలో చదివింపబడు విషయము. దీనిని పాస్చాత్య చరిత్ర్కారులు పలువిధములుగా మార్చి పాడుచేసి వారి ఇష్టమొచ్చినవి చదివించుచున్నారు. ఇంతకు చెప్పవచ్చినదేమనగా మన పురాణములు చరిత్రయే! మన
షులకు చరిత్ర జ్ఞానము లేదనుట, మన పూర్వ నాగరకతను ఎంత తక్కువ పరచినచో వారి యేలుబడి అంత గొప్పగా సాగునని, పాశ్చాత్యులు పన్ని పన్నుగడ!
ఈ రచనాకాలం ఏనాటిదైనా, ఈ రోజుకి కూడా భారతీయులమందరము పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ మన మూలాలని విసర్జిస్తున్నాము. మంచి-పురోగమనదాయములు గ్రహించుట నాకు నిరభ్యంతరములు, గానీ స్వనింద-పరస్తుతి వైఖరి విపరీతముగా ప్రబలుతోంది. విశ్వనాధ వారు ఇదే విషయాన్ని చాల చక్కగా పురాణ వైర గ్రంధ మాలలో వాడుకున్నారు. పాశ్చాత్యులు మనకు చెప్పిన తప్పుడు పురాణాలకు ఇది వైరమన్న మాట! ఈ విషయాన్ని సూటి గా ప్రస్తావించక, కధ జరిగిన కాలము, ప్రదేశము వంటి విషయాల్లో చెప్పడం జరిగింది. ఉదాహరణకు జనమేజయుడు అ పక్కనే ఎక్కడో రాజ్యం చేస్తున్నడనీ, భగవద్గీత అను కొత్త గ్రంధం వెలువడిందనీ, పాత్రల చేత చెప్పిస్తూ, భారత యుద్ధం జరిగిందన్న రచయిత నమ్మకాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది. నాకీ అంశం మరి చాలా బాగా నచ్చింది!