అనుచరులు

22.11.10

మైదానం ఎందుకు??

చలం, ఈ పేరు వినగానే గుర్తొచ్చేది "మైదానం". విప్లవ రచనలు చేసిన వారు ఎందరు ఉన్నా, స్త్రీవాదం అనగానే స్ఫురించేది గురజాడ, కందుకూరి, చలం. స్త్రీవాదం లో చలానిదొక ప్రత్యేక శైలి. మిగతా వారు సమాజం లో ఉన్న దురాచారలను దుయ్యబట్టినా, కుటుంబ, సమాజ నియమోల్లంఘన కావించక, ఆడది తన కష్టాల నుండి వేరొకరి సహయం తో ఎలా బయట పడిందో సున్నితంగా, వ్యంగ్యంగా చెప్పటం చేశారు. అయితే చలం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా మైదానం లో రాజేశ్వరి పాత్రను చిత్రీకరించారు.
రాజేశ్వరిది ప్రేమరాహిత్యాన్ని అనుభవించే పాత్ర. భర్త దగ్గర తాను పొందలేని ప్రేమను వేరొకరి దగ్గర వెతుక్కుంటూ, సమాజపు కట్టుబాట్లను ఎదిరిస్తుంది రాజేశ్వరి. బుద్ధిని ఉపయోగించక, కేవలం మనసు మాట వింటూ, తాను తీసుకున్న నిర్ణయాలకు ఎలా బలయి పోయిందన్నది కధాంశం. స్త్రీవాదం కంటే కూడా నాకు ఈ నవల లో విచ్చలవిడితనం, నియమోల్లంఘన అధికంగా స్ఫురించాయి. కథ లో అంతర్లీనంగా కట్టుబాట్లను కాదంటే ఎదురయ్యే కష్టాల గురించి ఉన్నా, రాజేశ్వరి మానసిక సంఘర్షణను అద్భుతంగా వర్ణించినా, పాఠకుల ద్రుష్టి ఆ అంశం పైన పడటం కష్టం. రాజేశ్వరి భర్తను విడిచి పెట్టి పరాయి వాడితో వెళ్ళిపోవడం, తరువాత అతడు ఆమెని అవసరాలకు వాడుకొని వదిలేయడం, ఈ క్రమంలో ఇంకో మగాడు పరిచయమవటం.... ఇలా రాజేశ్వరి జీవిత పయనం గమ్యం లేనిదై, కోరుకున్న ప్రేమ దొరకక, హత్యా కాండ లో అంతమై, చివరికి న్యాయస్థానం లో నిలబడుతుంది. ఖచ్చితంగా ఈ కథ లో , నియమోల్లంఘన వల్ల వచ్చే నష్టాల కన్నా కూడా బరితెగించడం అన్న అంశం మీదనే పాఠకుల ద్రుష్టి పోతుంది. ఈ రచన ద్వారా చలం సమాజానికి ఏం చెప్పదలచుకున్నదీ నాకైతే అర్ధం కాలేదు!!!

1.11.10

జై తెలుగు తల్లి!

భారతదేశ0 లోనే ప్రప్రధమంగా భాషను ఆధారంగా చేసుకుని అవతరించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పొట్టి శ్రీరాములు గారి మరణం మన తెలుగు వారి అస్థిత్వాన్ని కాపాడిందనే చెప్పాలి. ఆయన మరణించాకా దాదాపు ఏడాదికి గానీ ఆంధ్రా పుట్టలేదు.15 డిసెంబరు 1952న పొట్టి శ్రీ రాములు అమరులయ్యారు.నవంబరు 1, 1953 లో ఆంధ్ర రాష్ట్రం పుడితే, తెలంగాణాను కలుపుకుని సంపూర్ణం గా తెలుగు వారితో కూడిన రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది మాత్రం నవంబరు 1, 1956 లో. మన యావత్తెలుగు జాతి కలిసి మెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని, మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి!

మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లి మీ కోసం ..


మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......

ఈ పాట శంకరంబండి సుందరాచారి, దీనబంధు అనే చలన చిత్రం కోసం 1942 లో లిఖించగా, టంగుటూరి సూర్య కుమారి ఆలపించారు. ఈ మధ్యనే ఈ పాటను శేఖర్ కమ్ముల "లీడర్" అనే చలనచిత్రంలో వాడుకున్నారు.