అనుచరులు

20.8.10

వేగిరముగనేతెంచెను బేగం!!

ఇటు శ్రావణ మాసం పూజల హడావిడి ఇంట్లో, మరి రజియాకేమో రంజాన్ హడావిడి. రజియ లేనిదే ఆమ్మవాళ్ళింట్లో ఒక్క పనీ తెవలదు. లేచిన దగ్గర నుంచీ రజియ బేగం ఎప్పుడొస్తుందని గుమ్మంలో కూర్చోవడం అలవాటాయె! పెదనాన్న వాకిట్లో నిలబడి వేగిరముగనేతెంచెను బేగం అంటూ లోపలికి వస్తూ, దీన్నే సమస్యగా తీసుకుని పద్యం చెప్పమనగా. ఈ మూడు పద్యాలు గాట్టిగా చెప్పేశా, నా పుస్తకంలో రాశేశా, ఇప్పుడు బ్లాగేస్తున్నా. కంద పద్యానికి చాలా వరకూ దగ్గరగా ఉంటాయి ఈ ఆశువులు. చదవల్సిందే మరి...అబ్బా ! చదవండి...

హరిననుసరించ గోరుతు
భువిజేరె లచ్చి నాంచారను రూపము లో
శీఘ్రాన పతిని జేరగ
వేగిరమునతో వచ్చెను బేగమచటకున్ (తిరుమలకు)

జాబిలి జూడగ జామున
షాజహాను జేరె జమున సతిన్వీడి! పతి తా
రకను వలచునని తలపున
వేగిరమునతో వచ్చెను బేగమచటకున్

చతురోపాయము జే, రో
షనార పతి ప్రాణములు రక్షింపుటకు కట్ట
గ రక్ష అరి కరమునకున్
వేగిరమునతో వచ్చెను బేగమచటకున్

14.8.10

జండా జననం...


ఈ నేల మీద పుట్టిన మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే అది కొన్ని సంవత్సరాల పాటూ కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు, తమ స్వలాభం చూసుకోకుండా సమాజ క్షేమం కోసం చేసిన త్యాగాలే.
ఎందరి వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం
వారందరిని తలచుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు
..... అన్నట్టుగా మనం స్వాతంత్ర్య సమర వీరులందరికీ అర్పించే నివాళి, వారిని తలచుకోవటమే. ఎందరో సమిధలైన ఈ స్వేచ్ఛా యజ్ఞంలో తెలుగువారు గర్వించదగిన వీరులు ఎందరో ఉన్నారు. కత్తి పట్టిన వారు కొందరైతే , కలం పట్టిన వారు కొందరు. అహింస మార్గంలో నడచినవారు ఇంకొందరు. అయితే మన దేశం యొక్క అస్థిత్వాన్ని ప్రపంచానికి చాటే జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు తెలుగువారవడం, మనం గర్వించాల్సిన విషయం. పింగళి వారు పుట్టినది కూడా ఈ నెల 2వ తేదీనే. బందరు లో పుట్టిన పింగళి వారు, ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత పైచదువులకి కొలొంబొ వెళ్ళారు. భారత దేశం తిరిగివచ్చాకా ప్రభుత్వోద్యోగంలో చేరారు. గాంధీ గారు దక్షిణాఫ్రికా లో తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఆకర్షితులైన పింగళి వారు, తరువాతి కాలంలో కాంగ్రెస్సు పార్టీకి జెండ అవసరమని సూచించారు. అలా మొదటిసారిగా రూపొందినది మువ్వన్నెల జెండా. అయితే కాలాంతరంలో, దీంట్లోని చరకా అశోకచక్రంగా మారి భారత దేశపు జాతీయ పతాకంగా అవతరించింది. మత సామరస్యానికి, సిరిసంపదలకు, అహింసకూ మన జెండాను ఎగరవేసి అప్పుడే 63 వర్షాలు గడిచాయి., అయినా మనం సాధించవలసినది ఎంతో ఉన్నది. మహా వీరుల త్యాగాన్ని గౌరవిస్తూ మనం శాంతి సామరస్యాలతో జీవిస్తూ, బుద్ధుని పుట్టుకకు సార్ధకత చేకూర్చుదాం. భారత మాతకు జయము జయము..........

10.8.10

పుష్పవిలాపం

ఈ రోజు అరుగు దగ్గర కూర్చుని నేనూ, మా వదినా కబుర్లు చెప్పుకుంటున్నంత సేపూ, నా ద్రుష్టంతా వాకిట్లోని గులాబీ మొక్కలపైనే. మాలతి వాసనల కోసం రాత్రి మళ్ళీ ఆరు బయటే కూర్చుందామని అనుకున్నాం. తెలియకుండానే మనసు పుష్పవిలాపాన్ని గుర్తుచేసుకుంటోంది. అందుకే కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి) గారి అద్భుత రచనైన పుష్పవిలాపం మీతో పంచుకుంటున్నాను. సున్నితమైన భావజాలంతో పాటూ, కోపం, బాధ ఇందులో కనబడుతాయి. ఘంటసాల గొంతులో జీవం పోసుకున్న ఈ పుష్పవిలాపం చదవండి మరి...

నీ పూజ కోసం పూలు కోసుకు వద్దామని ప్రొద్దుననే తోటలోనికి వెళ్ళాను ప్రభూ. ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో ఉద్యానం కళకళలాడు తున్నది. పూల బాలలు తల్లి వొడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు,

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము దీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానస మందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.

ఒక సన్నజాజి కన్నియ తన సన్నని గొంతుకతో నన్ను జూచి ఇలా అన్నది ప్రభూ.
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

ఎందుకయ్యా మా స్వేచ్ఛభిమానాని కడ్డు వస్తావ్? మేం నీకేం అపకారం చేశాం?
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో,
తాళుము, త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఇంతలో ఒక గులాబి బాల కోపంతో ముఖమంతా ఎర్రజేసుకుని ఇలా అన్నది ప్రభూ.
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

పాపం, మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు గాబోలునే !
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

ఓయి మానవుడా !
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన నా హృదయకుసుమాన్ని గైకొని
నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరించుము ప్రభూ!

8.8.10

కీర్తికిరీటాలు

యద్దనపూడి సులోచనారాణి తన నవలా నాయకులను ఆరడుగుల అందగాడిలాగానూ, గిరజాల జుత్తు వాడిగానూ, రింగు రింగు పొగలూదే సోగ్గాడిలాగానూ, బాహ్య సౌందర్యాన్ని వర్ణించినా...ఆమె నాయికను మాత్రం చెక్కు చెదరని ఆత్మాభిమానానికి నిదర్శనంగా చూపుతుంది. యద్దనపూడి వర్ణనలో పాఠకులకు, నాయిక అందచందాల కన్నా కూడా, ఆమె వ్యక్తిత్వమే మనసులో నిలిచిపోతుంది. సెక్రెటరీ, హ్రుదయ గానం వంటి నవలలలో, నాయిక పాత్రలలో ఆత్మాభిమానమే కాక, స్త్రీ సహజమైన అమాయకత్వంతోబాటూ మొండితనం, మూర్ఖత్వం కనబడుతాయి. అయితే ఈ కీర్తికిరీటాలు ఇందుకు కాస్త భిన్నం అనే చెప్పుకోవాలి. కీర్తికిరీటాలు లో నాయకుడు తేజ పాత్ర, నాయిక అయిన స్వర్ణ కన్నా కూడా చాలా గాఢమైనది. తేజ చిన్నతనంలోనే తల్లిదండ్రులకి దూరమై, తాతగారింట్లోనే ఉంటూ, మేనత్త పెంపకంలో పెరుగుతాడు. తేజ పెద్దైన కొద్దీ, తనదైన ప్రపంచాన్ని నిర్మించుకుని, అందులోనే జీవిస్తూ, గిరిజనులకు సాయపడుతుంటాడు. చిననాటి జ్ఞాపకాలను మర్చిపోలేకా, స్వర్ణకు దగ్గర కాలేకా, తేజ పడే బాధే ప్రధానంగా ఉంటుంది. గొప్ప నాట్య మయూరి అయిన స్వర్ణకు జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ఎదురుకునేలా, తేజ ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఎలా కల్గించాడన్నది అసలు కధ అయినా, తేజ తల్లి రాజ్యలక్ష్మి వలనే కధకు పునాది పడుతుంది. రాజ్యలక్ష్మి జీవితాన్ని చిన్నగానే కధ మధ్యలో రచయిత్రి చెప్పినా, ఆమె పడే అంతర్మధనం, మానసిక వేదన కధలో అంతర్లీనంగా ప్రాముఖ్యతను వహిస్తాయి. జీవితం పట్ల ఆశావాహ ద్రుక్పధాన్ని, ఈ నవల చక్కగా ప్రతిబింబిస్తుంది. నేను చదివిన పుస్తకాలలో, ఈ కీర్తికిరీటాలకు ఎప్పటికీ ప్రధమ శ్రేణిలో స్థానం ఉంటుంది. వీలైనప్పుడు మీరు కూడా చదువుతారుగా....

6.8.10

తెగులు..కాదు కాదు తెలుగు!!!


భాషాభిమానం అనగానే ఠక్కున గుర్తొచ్చేది మన తమిళ తంబీలే. తమ భాషను వారు గౌరవించే విధానం ప్రశంసనీయం. తమిళ భాషకు ప్రాచీన భాష హోదాను దక్కించుకున్నా(ఇప్పుడు మనకీ ఉందనుకోండి..), మాత్రుభాషా దినోత్సవాలు ఘనంగా జరిపినా, అది మన తంబీలకే చెల్లింది. కన్నడ దేశీయుడైన రాయలు, తెలుగు భాషను ఆదరించి, దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ, ప్రాచుర్యం తీసుకొచ్చారు గానీ, తెలుగు వారమైన మనం, మన భాషను కాపాడుకోలేక పోతున్నాం. తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన రాయల వారి 500 వర్షాల పట్టాభిషేక మహోత్సవములు మన ప్రభుత్వం నిర్వహించదలచటం హర్షణీయమైనా, అధిక శాతం ప్రచార పత్రికలను ఆంగ్లం లో మాత్రమే ముద్రించడం బాధాకరం!!!

5.8.10

బొమ్మల కొలువు

సత్తిరాజు లక్ష్మీ నారాయణ గారు బాపు గా సుప్రసిద్ధులు.తెలుగింతి అందానికి పర్యాయ పదం బాపూ బొమ్మ అని ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. పదారణాల తెలుగు పడుచుల సొగసును, ప్రపంచానికి తన కుంచె తో పరిచయం చేశారు బాపు. ప్రాచీన భారతీయ చిత్రకళా శైలి లో బాపు బొమ్మలు దర్శనమిస్తాయి. తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ ముదురు రంగులలో భారతీయతను బాపు బొమ్మలు ప్రతిబింబిస్తాయి. నవరసాలకు చిత్ర రూపమిచ్చినా, రమాయణ ఇతిహాసానికి ఏక రూపమిచ్చినా, అది బాపు కి మాత్రమే సాధ్యం. నాకు ఇష్టమైన బాపూ బొమ్మ గంగావతరణం. బాగున్నాయి కదా ఈ బొమ్మలు!!!



బాపూ అనగానే అందమైన బొమ్మలెలా గుర్తొస్తాయో, రమణ అనే పేరు కూడా జ్ఞప్తికి వస్తుంది. బాపు-రమణల స్నేహం అటువంటిది. బాపూ బొమ్మల కొలువు పేర్చితే, ముళ్ళపూడి వెంకట రమణ ఆ బొమ్మల చేత అల్లరి చేయించి, మన ఇంట నవ్వుల పూవులు విరబూయించారు. బుడుగు గాడి అల్లరి, సీగాన పెసూనాంబా ఈ రోజుకీ నాకెంతో ఇష్టం. అయితే ఈ మిత్ర ద్వయం తమ ప్రతిభతో తెలుగు చలనచిత్ర సీమకు ఆణిముత్యాలంటి చిత్రాలను అందించింది.బాపూ, తెలుగు, హిందీ భాషల్లో 40 పైగా చిత్రాలను రూపొందించారు. వీటిలో, బంగారు పిచ్చిక, బుద్ధిమంతుడు, సంపూర్ణ రామయణం, సీతా కల్యణం, శ్రీ రాజెశ్వరివిలాస్ కాఫీ క్లబ్, శుభోదయం, ముత్యాలముగ్గు మొదల్కొని.. నా చంటప్పటి, పెళ్ళి పుస్తకం, మిస్టర్ పెళ్ళం వరకూ బాపు సినిమాలు నేను చాలానే చూశాను. అన్నింటి లోనూ ఒక సారూప్యతను గమనించవచ్చు. అదే కధానాయిక ఆహార్యం. పెద్ద వాలు జడ, పూలూ, కళ్ళకు కాటుక, చెవులకు రింగులు, కాలి పట్టాలు, చీరల్లో అందంగా, పక్కింటి అమ్మయిలా బాగుంటుంది.


అందమైన తెలుగు వాకిళ్ళు, ఉయ్యాల బల్లలు, మెలిక ముగ్గులు...ఇలా ప్రతీ సన్నివేశం లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. బాపు ఊహలకు రమణ తన సంభాషణా చాతుర్యం తో ప్రాణం పోశారు. సీతా కల్యణం చిత్రం లో రామునికి ఒక్క సంభాషణ కూడా ఉండక పోవటం గమనార్హం. అలాగే, చారెడు-పిడికెడు-బారెడు అంటూ పెళ్ళిపుస్తకం లో దివ్యవాణి అందాన్ని, రాజేంద్ర ప్రసాద్ చేత తమాషాగా చెప్పించి, ఆ మాటల అర్ధాన్ని, ఒక పాటలో చెంపకు కన్నులు చారెడు-సన్నని నడుము పిడికెడు-దువ్వీ దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు... అంటూ పూరించారు. బాగుంది కదా!!!
ఇంకా, అపార్ధసారధమ్మా(పెళ్ళి పుస్తకం), మంగళాస్త్రాలు(మంగళసూత్రమనమాట...సుందరకాండ సినిమా లో) వంటి పదప్రయోగాలు నవ్విస్తాయి. నా వరకూ బాపూ చిత్రాలలో చెప్పుకోదగిన ప్రయోగాలు...ఎప్పుడు చూసినా ఇద్దరు నాయికలతో అడిపాడే శోభన్బాబు చేత, ఏక పత్నీవ్రతుడైన రాముని పాత్ర వేయించటం(సంపూర్ణ రామయణం).అలాగే, వాణిశ్రీ తో మేకప్ లేకుండా నటింపచేయటం(గోరంత దీపం). సినిమాలే కాక, బాపు-రమణలు టి.వి సీరియళ్ళు కూడా చేశారు. హంపాంచ్(హిందీ), భాగవతం చాల ప్రసిద్ధి చెందినవి. హమ్మయ్య!!!! ఇక చాలు కదా..బాపూ గురించి నాకు తెలిసిందంతా దాదాపుగా బ్లాగేశా....ఉంటాను మరి ఇక సెలవు!!

4.8.10

ఎందరో మహానుభావులూ.. అందరికీ వందనములు..

ఎందరో మహానుభావులూ అందరికీ వందనములు.. అనే త్యాగరాజ కీర్తన, తెలుగు వారి మర్యాదకూ, ఆదరణకూ చిహ్నం. అందుకే ఈ కీర్తనతో ఆరంభిస్తున్నా.

ఎందరో మహానుభావు-లందరికి వందనములు
ఎందరో మహానుభావులు అందరికి వందనములు

చందురు వదనుని యంద-చందమును
హృదయారవిందమున జూచి
బ్రహ్మానందమనుభవించు-వా (రెందరో)
చందురు వదనుని అంద-చందమును
హృదయ-అరవిందమున జూచి
బ్రహ్మానందము అనుభవించు-వారు (ఎందరో)

1.సామ గాన లోల మనసిజ లావంయ
ధన్య మూర్ధన్యు (లెందరో)
సామ గాన లోల మనసిజ లావంయ
ధన్య మూర్ధన్యులు (ఎందరో)

2.మానస వనచర వర సంచారము సలిపి
మూర్తి బాగుగ పొడగనే వా (రెందరో)
మానస-వన-చర వర సంచారము సలిపి
మూర్తి బాగుగ పొడగనే-వారు (ఎందరో)

3.సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయువా (రెందరో)
సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము-సేయువారు (ఎందరో)

4.పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను
పాడుచును సల్లాపముతో
స్వర-లయాది రాగములు తెలియువా-(రెందరో)
పతిత పావనుడు-అనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను
పాడుచును సల్లాపముతో
స్వర-లయ-ఆది రాగములు తెలియువారు (ఎందరో)

5.హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులిలలో
తెలివితో చెలిమితో కరుణ గల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా-(రెందరో)
హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులు ఇలలో
తెలివితో చెలిమితో కరుణ కల్గి
జగము ఎల్లను సుధా దృష్టిచే బ్రోచువారు (ఎందరో)

6.హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
యానంద పయోధి నిమగ్నులై
ముదంబునను యశము గలవా (రెందరో)
హొయలు మీర నడలు కల్గు
సరసుని సదా కనుల జూచుచును పులక-శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై
ముదంబునను యశము గల-వారు (ఎందరో)

7.పరమ భాగవత మౌని వర
శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష
కనక-కశిపు సుత నారద తుంబురు
పవన-సూను బాలచంద్ర-ధర శుక
సరోజ భవ భూసుర వరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు
కమలభవ సుఖము సదానుభవులు గాక (యెందరో)
పరమ భాగవత మౌని వర
శశి విభాకర సనక సనందన
దిక్-ఈశ సుర కింపురుష
కనక-కశిపు సుత నారద తుంబురు
పవన-సును బాలచంద్ర-ధర శుక
సరోజ-భవ భూ-సుర వరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు
కమల-భవ-సుఖము సదా అనుభవులు గాక (ఎందరో)

8.నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల
శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్ల జేసినట్టి
నీ మదినెరింగి సంతసంబునను
గుణ భజనానంద కీర్తనము సేయువా (రెందరో)
నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల
శాంత మానసము నీవు-అను
వచన సత్యమును రఘువర నీయెడ
సత్-భక్తియు జనించకను
దుర్-మతములను కల్ల-జేసిన-అట్టి
నీ మదిని ఎరింగి సంతసంబునను
గుణ భజన ఆనంద కీర్తనము-సేయువారు (ఎందరో)

9.భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములను శివాది షణ్మతముల
గూఢములను ముప్పది ముక్కోటి
సురాంతరంగముల భావంబుల-
నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన-వా (రెందరో)
భాగవత రామాయణ గీతా-ఆది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములను శివ-ఆది షణ్మతముల
గూఢములను ముప్పది-ముక్కోటి
సుర ఆంతరంగముల భావంబులను-
ఎరింగి భావ రాగ లయ-ఆది సౌఖ్యముచే
చిర-ఆయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజ ఆప్తులైన-వారు (ఎందరో)

10.ప్రేమ ముప్పిరి కొను వేళ
నామము తలచే వారు
రామ భక్తుడైన త్యాగ-
రాజ నుతుని నిజ దాసులైన వా (రెందరో)
ప్రేమ ముప్పిరి-కొను వేళ
నామము తలచే-వారు
రామ భక్తుడైన త్యాగ-
రాజ నుతుని నిజ దాసులైన-వారు (ఎందరో)