అనుచరులు

29.1.13

మొల్ల(కవుల కధలు)


మొల్ల, పేరుతో సినిమా కూడా తీశారు కాబట్టి చాలా మందికి ఇది ఒక కవయిత్రి పేరు అని తెలిసే అవకాశం ఉందనుకుంటున్నా! ( ఇది మా తరం వారిని ఉద్దేశ్యించి అంటున్నను గానీ పెద్దవారిని కాదండోయ్!) రామాయణాన్ని ఎంతో మంది కవులు రచించినా, మొల్ల రామాయణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి
మొదటిగా, ఒక స్త్రీ కవిత్వం చెప్పటం, అందులోనూ అది రామాయణం కావటం.
రెండు, అంతకు మునుపు ఉన్న ఎన్నో రామయణ కావ్యాల్లో లేని చమత్కారం మొల్ల రామయణం లో ప్రస్ఫుటంగా కనిపించడం.
మూడు,కేవలం 900 గద్యపద్యాల్లో రామాయణాన్ని పూర్తి చేయటం. వాల్మికి  మొదలగు వారు రాసిన రామాయణం కన్నా క్లుప్తంగా ఉన్నా, భావం లో  లోతూ, చమత్కారం, సరళతా కనబడుతాయి. ఇదే విషయం మీకు తెలియాలంటే పద్యం చదవండి:
   "సుడిగొని రాముపాదములు సోకిన ధూళి వహించి రాయియే
   ర్పడ నొకకాంతయయ్యెనట! పన్నుగ నీతని పాదరేణు వి
   య్యెడవడినోడ సోకనిది యెట్లగునోయని సంశయాత్ముడై
   కడిగె గుహుండు రాము పద కుంజయుగంబు భయంబు పెంపునన్."
శ్రీ రాముని పాదధూళి తాకి, రాయి ఒక స్త్రీ గా మారినదట!(అహల్య). అటువంటి ఇతడు నా ఓడలో కాలు మోపితే ఏమవుతుందో అని భయపడిన గుహుడు, ఓడ ఎక్కే ముందు రాముని పాదాలను కడిగాడని  మొల్ల చమత్కరించింది. .మొల్ల ఊహ బాగుంది కదా! ఇదే ఊహను, బాపు తన సంపూర్ణ రామాయణం సినిమా లో బాగా చిత్రీకరించారు.
పై పద్యం భావ చమత్కారం చూబెడితే,పదాలకట్టులోని చమత్కారాన్ని పద్యం చూపుతుంది:
 "రఘువరుడిచ్చిన ముద్రిక రఘువల్లభుదేవికిచ్చి రభసంబున నా
 రఘువరునకానవాలుగ రఘువల్లభుదేవి చేతి రత్నము గొంటిన్"
సీతాదేవికి రాముని ఉంగరాన్నిచ్చి,ఆమె గురుతుగా రాముని కోసం ఆమె దగ్గరనుండి ఒక రత్నాన్ని(చూడామణి)తీసుకున్నాను అని హనుమంతుడు అంటున్నాడు. కార్యము చక్కబెట్టడానికి రభసయిందని(లంకాదహనం) కూడా చెబుతున్నాడు. రఘు,రభస,రత్నము శబ్దాలను వ్రుత్యానుప్రాస అలంకార పద్ధతిలో మొల్ల అందంగా వాడినది. ఇటువంటి అనేక పదప్రయోగాలను మొల్ల రామాయణంలో చూడొచ్చు
మొల్లది ఇంకొక్క పద్యం రాస్తాను, ఇది నాకు చాలా నచ్చింది,
ఉన్నాడు లెస్స రాఘవు
 డున్నాడిదెకపుల గూడి యురుగతిరానై
 యున్నాడు నిన్ను గొనిపో
 నున్నాడిది నిజము నమ్ము ముర్వీతనయా!"
పద్యంలో హనుమంతుడు సీతతో, రాముడు బాగానే ఉన్నాడు, మా వానరులతో కలిసున్నాడు, నిన్ను నిజంగా తీసుకెళ్తాడు నన్ను నమ్ము! అని చెబుతున్నాడు.ఉన్నాడు అనే మాటతో అద్భుతంగా ప్రాస వాడి, ఇంత సులభమైన పద్యానికి కూడా మొల్ల ఎంతో అందాన్ని తెచ్చింది. ఇవి కొన్ని మాత్రమే! నాకు ఇంకా చాలా పద్యాలని ప్రస్తావించాలని ఉన్నా, ఇక్కడితో ఆపుతున్నా!
 మొల్ల గురించి మరిన్ని విషయాలు ఇంకో వ్యాసంగా రాస్తాను. ఇక సెలవు

13.1.13

సంక్రాంతి శుభాకాంక్షలు!



అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! సంక్రాంతి కబుర్లేవీ లేవు. ఇంతకు ముందు ముగ్గులూ, బొమ్మల కొలువులని ఏదో ఒక పనుండేది. ఈ ఏడు మేము ఇల్ల్లు వదిలేసి అపార్టుమెంటు లోకి వచ్చేశాం. అందుకని పండుగని ఇల్లు కడక్కోవడానికి కూడా లేదు. ఫిండి వంటలు మాత్రం బాగా చేశాను, మా అమ్మతో కలిసి! సున్నుండలూ, కజ్జికాయలూ, గవ్వలూ, జంతికలూ! ఇంకా...! కవుల కధలు నా తెలుగు తీరాలుకు చేర్చాలనుకున్నా, వీలు చిక్కట్లేదు. ఈసారి తప్పకుండా ఒక మంచి కవి గురించి ప్రస్తావిస్తాను. ఇహ సెలవు మరి!