అనుచరులు

7.4.11

నా అభిప్రాయం

నేనెన్నో విషయాల గురించి తెలుగు తీరాల్లో ప్రస్తావిస్తున్నా, చలం గురించిన స్పందనలే ఎక్కువగా వస్తాయి. అందుకే ప్రత్యేకించి మళ్ళీ ఆయన గురించే రాస్తున్నా! చలం గారు సామాజిక చైతన్యానికి క్రుషి చేస్తే, ఆయన రచనలను ఖండించడమేమిటని చాలా మంది తమ అభిప్రాయాన్ని నా ముందుంచారు. చలం సాహిత్యం చదివే వారికి, అందులోని విపరీత పోకడలూ, మానవ సంబధాలను అతిక్రమించి విచ్చలవిడిగా బతికేయడం తప్ప ఏదీ కనపడదన్నది నా అభిప్రాయం. అసలు సామజిక చైతన్యం ఏముంది ఆ రచనలో? ఒకరి ఇంట్లో ఫలానా విధంగా ఒకత్తి ఒకడితో వెళ్ళిపోయింది అని చెబితే సమాజానికి ఒరిగేదేమిటి? వ్యక్తిత్వం అన్నది లేకుండా ఆడవారు ఉన్నారనుకోవడమే తప్పు. పూర్వ కాలం లో ముసలి మొగుడినీ, అత్తగారినీ, సవతి పిల్లల్నీ, సొంత పిల్లల్నీ తీర్చిదిద్దిన వారందరూ వ్యక్తిత్వం లేనివారేనా? ఎంత ధ్రుడ సంకల్పం ఉంటే వారలా చేయగలరు? ఎవరో ఒకరు తప్పు దారిన పోతే, ఇదివరకూ అందరూ తప్పుడు వారేనా? నేను ఎప్పటికీ చలం ప్రసిధ్ధి పొందిన రచనలను ఆస్వాదించలేను. చాలా మందికి తెలియని విషయం ఏమంటే, చలం తన వైఖరి తప్పని ఒప్పుకుని రమణ మహర్షి గారి శిష్యుడై ఆఖరి రోజులు గడిపారు. అప్పుడు ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అనవసర భావజాలానికి ప్రభావితమైన వారు, అదే వ్యక్తి స్వానుభవంతో తెలుసుకున్న లోకోత్తర సత్యాలను చెబితే ఎవరు పట్టించుకున్నారు? దీన్ని బట్టే అర్ధమవుతోంది! చాలా మందికి కావాల్సినది వివాదాస్పద అంశాలు గానీ, మంచి విషయాలు కాదు. పైగా ఈ వివాదాలకు, సమాజిక చైతన్యం అన్న పేరొకటీ! హాస్యాస్పదం గా ఉంది.

కామెంట్‌లు లేవు: