అనుచరులు

1.7.12

గురువుగారి పాటలు- అన్నమయ్య పాఠాలు

కొన్ని నెలలుగా నేను రాజమండ్రి లో పుట్టిన అసలుసిసలైన తెలుగమ్మాయిగా బతికేస్తున్నాను. సినిమాలు, షికారులు, హడావుడి, గజిబిజి గందరగోళం నుండి బయటపడి సంగీతం, సాహిత్యం, వంట-వార్పు అంటూ హాయిగా మా అమ్మతో ఆనందంగా ఉన్నాను.మా కొత్తింటి పనులు కూడా నెమ్మదిగా అవుతున్నాయి.ఏదో ఈనాడు ఆదివారం అనుబంధం వాడు రాసినట్టు గానే నా రాశి ఫలాలు జరగబట్టి మధ్యమధ్యలో పెళ్ళీ-పేరంటం; విందు-వినోదం అని అందరినీ కలుస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది విజయవాడ లో మా సంగీతం గురువుగారి గురించి. చిన్నప్పుడు నేను బాలమ్మ గారి దగ్గర వర్ణాల దాకా సంగీతం నేర్చుకున్నా. మళ్ళీ దాదాపు పన్నెండేళ్ళ తరువాత బాలమ్మ గారి స్నేహితురాలైన ప్రభాకర రామలక్ష్మి గారి దగ్గర సంగీత పాఠాల కోసం వెళ్ళడం మొదలు పెట్టాను. వాళ్ళింటికి వెళ్ళేసరికి ఆవిడ  టి.టి.డి చానలు పెట్టుకుని అందులో ప్రసారమయ్యే అన్నమయ్య కీర్తనలు ప్రతి రోజూ విని, స్వరం రాసిపెట్టుకుని మరీ  నాకు పాడి వినిపించే వారు.నాకేమో మొదటి నుంచీ అన్నమయ్య అంటే పెద్దగా ఇష్టం లేదు.నాకు భాషా జ్ఞానం ఎలా వచ్చిందో తెలియదు గానీ, చిన్నప్పటి నుంచే అన్నమయ్య శ్రుంగార కీర్తనలను వ్యతిరేకించేదాన్ని. పైత్యం ఎక్కువయ్యి పాటలు రాశాడు గానీ గొప్ప భక్తుడేమీ కాదని ఒకప్పటి నా భావన. గురువు గారేమో ఖచ్చితంగా రోజూ ఒక అన్నమయ్య కీర్తన పాడించందే వదిలి పెట్టరు!ఈ అన్నమయ్య నన్నిలా పట్టుకున్నాడేoటి రా బాబోయ్! అని నేను ఎన్నో సార్లు ఆలోచించినా, పాట పాడటం మొదలెట్టాకా ఆపకుండా పాడేదాని. ఒక్కో కీర్తన పాడుతుంటే వచ్చే అనందం నేను చెప్పలేను. రాయలేను కూడా!  ఈ అన్నమయ్య పాటలు నాకెందుకు నచ్చుతున్నై, వీటిలిని ఏ రకంగా  అర్ధం చేసుకోవాలని నేను అనుకున్న కొద్దిసేపటికే నా మనసుకు ఇలా తోచింది: మా తరానికి శ్రుంగారం వంటి విషయాల మీద భారత వేదధర్మ  సాంప్రదాయేతరాభిప్రాయాలు బలంగా ఉన్నాయి. భారత సంప్రదాయం ప్రకారం శ్రుంగారనికి కళత్ర ధర్మం, పవిత్రత, పిత్రు దేవతల ఆశీర్వచనములూ ఆపాదించబడినవి. శ్రుంగార కీర్తనా స్తుతి ద్వారా అన్నమయ్య అటువంటి భావనలకు ఒక   దైవత్వాన్నీ, పవిత్రతనీ ఆపాదించాడు.స్వామి వారిని కీర్తించాడనడం కంటే  భావి తరాలకి ఒక నిక్షిప్త  సందేశం అందించాడు అన్నమయ్య. ప్రతీ విషయంలో ఉన్న మంచిని చూడడానికి ప్రయత్నిస్తే, దానిలోని లోతునూ, నిగూఢార్ధాలను మనంతట మనమే నేర్చుకోగలమనిపిస్తోంది!   

కామెంట్‌లు లేవు: