
విశ్వనాథ సత్యనారాయణ గారి ఆఖరి నవల నందిగ్రామరాజ్యం. 1976 జులై నెలలో రచింపబడినది. ఆయన శైలికి ఇది పూర్తిగా భిన్నమైన ఆధునిక వాడుక భాషలో ఈ నవల ఉంటుంది. అద్భుతమైన వ్యంగ్యం ఇందులో మనం ఆస్వాదించచ్చు. కలియుగ లక్షణాలూ, ప్రభుత్వాల పనితీరూ మొదలైనవి ముఖ్యాంశాలుగా చర్చింపబడ్డాయి. కధాంశమేమో రాముడి పట్టాభిషేకం! వనవాసం తరువాత రాముడు నందిగ్రామానికి వచ్చి, అయోధ్యాపురి రాజుగా పట్టభిషిక్తుడవ్వాలి. రాముడు లేని అయోధ్య లో కలి ప్రభావం చేత ఏర్పడిన ప్రజా ప్రభుత్వ పనితీరులో లొసుగులూ, వానర సేన చేసిన సవరణలూ మూల కధ. ఆంజనేయుడి నాయకత్వంలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో చదివితే చాలా నవ్వొస్తుంది. విశ్వనాథ వారి వ్యంగ్యాస్త్రాలు ఫలించాయి ఈ నందిగ్రామ రాజ్యంలో! ఈ నవల గురించి చెప్పాలంటే ముఖ్యంగా ప్రస్తావించాల్సింది ఆంజనేయుల వారి ఇంగ్లీషు భాషా ప్రకాశము! రాముడు లేనప్పుడు అయోధ్యను పాలిస్తున్న మంత్రులలో ఒక విద్యాశాఖా మంత్రి ఉన్నాడండి. అతడితో ఒక సందర్భంలో హనుమంతులవారిలా అన్నారు:
కోసల దేశంలో వేద విద్య పాడు చేయడానికి శంబూకుడు ( విద్యా మంత్రి) ఈ కళాశాలలు పెట్టాడు. మీ విద్య పేరు క్లేశ విద్య. కోసల అన్న పదానికి విక్రుతి ఈ క్లేశ శబ్దం. కాని సంస్క్రుతంలో క్లేశం అంటే కష్టమని అర్ధం. దేశంలో అందరూ క్లేశ విద్య అనరు.ఇక్లేశ విద్య అంటారు. ఎందుచేతనంటే సమ్యుక్తంగా ఉన్న అక్షరం ఉఛ్చరించడం కష్టం గనుక సామాన్య జనం దాని వెనుక ఇ -కలుపుతారు. మధ్య ఒక సున్నా పెడితే ఉచ్చరించడం ఇంకా తేలిక. అందుచేత మీ భాషను ఇంగ్లేశ మంటారు. మీ భాషకు ముక్కూమొగం లేదు. అది భాష కాదు.
ఇంగ్లీషు భాష శబ్దావిర్భవణకు విశ్వనాథ వారి భాష్యం బాగుంది కదా!