అనుచరులు

15.1.14

గొబ్బిళ్ళకు ప్లాస్టిక్ గ్రహణం

  అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ ఏడు భోగి మంటలు వేయలేదు.కానీ తెలుసున్న వాళ్ళింటికి బొమ్మలకొలువు పేరంటానికి వెళ్ళొచ్చా. భోగి రోజు సాయంత్రం సందె గొబ్బెమ్మలకూ మమ్మల్ని పిలిచినా వెళ్ళడం కుదరలేదు.మర్నాడు  బొమ్మలుకు వెళ్ళాము.అమ్మమ్మగారూ వాళ్ళూ కూడా చాలా ఏళ్ళ తరువాత ఈ ఏడే గొబ్బిళ్ళు పెట్టారట.వాళ్ళింటి పక్కనే ఉన్న గుళ్ళో గోశాల ఉంటే  అక్కడినించి పేడ తెచ్చి కానించారు.ఇంతకు మునుపు ఆవు పేడ దొరికేది కాదా అని నేను అడిగితే వాళ్ళన్న మాట ఠక్కుమనిపించింది.ఈ గుళ్ళో ఆవులు బయటకి వెళ్ళవట, మేత అక్కడే తింటాయట.చాలా మటుక్కు ఆవుల్ని బయటకు వదిలేయడం వల్ల,అవి దారిలో ఉండే ప్లాస్టిక్  కాగితాలు, చెత్తా చెదారం తిని తిరుగుతాయి. ఈలాటి ఆవు పేడతో గొబ్బెమ్మలు చెయలేమట!!సరిగ్గా గుండ్రంగా అయ్యి గొబ్బెమ్మలా అందంగా ఉండవు, అందులోని ప్లాస్టిక్ అవశేషాలు వల్ల! ఇన్నాళ్ళూ పశువులు ప్లాస్టిక్ తినడం వలన మంచి పాలు దొరకవనుకున్నాను గానీ ఇలా గొబ్బెమ్మలకీ కాలం చెల్లిపోవటానికీ ప్లాస్టిక్ కారణమవుతుందనుకోలేదు!!!ముగ్గులూ,గొబ్బిళ్ళూ,బొమ్మలూ ఇవి మన సత్సాంప్రదాయాలు !! కోడి పందాలు, జంతు బలులూ అమానుషం. మనిషి ఇతర జంతువుల కన్న గొప్పవాడైనప్పుడు,బలవంతుడైనప్పుడూ వాడు తనకన్నా నిర్బలులనికాపాడాలి తప్ప హాని చేయకూడదని గాంధీ గారు చెప్పిన మాట నాకు నచ్చిన మాట. ఈ పండుగ నాడు జరిగే అమానుషత్వానికి అంతం పలికి, అందరూ సత్సాంప్రదాయాలను పాటించాలని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.    

కామెంట్‌లు లేవు: